
పక్షిలాగా కాంగ్రెస్ మళ్లీ పైకిలేస్తుంది
హైదరాబాద్ : ప్రజలు మార్పు కోరుకోవటం వల్లే కేంద్రంలో యూపీఏ ఓటమి పాలైందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. పక్షిలాగా కాంగ్రెస్ మళ్లీ పైకి లేస్తుందని ఆయన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ రెండోరోజు సదస్సులో అన్నారు. టీఆర్ఎస్ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిందని జైపాల్ అన్నారు. వాటిని ప్రజలను నమ్మడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందన్నారు.
రుణమాఫీ విషయంలో ఆర్బీఐ ఒప్పుకోవడం లేదనే సాకులు చెప్పకుండా ....ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయాలని జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును నరేంద్ర మోడీ, అద్వానీ బాహాటంగానే వ్యతిరేకించారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టమేంటో చంద్రబాబు, మోడీ చెప్పాలని జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి లేవని, టీఆర్ఎస్కు సెక్యులరిజంపై నమ్మకం లేదని అన్నారు. ఆపార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వదనే గ్యారెంటీ లేదన్నారు. సెక్యులర్ పార్టీలని చెప్పుకున్న టీడీపీ, డీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.