తాండూరులోని జిల్లా ఆస్పత్రికి సుస్తీ
తాండూరు టౌన్ : పేరుకే అది పెద్దాస్పత్రి.. రోగులకు అందే వైద్య సేవలు అంతంతమాత్రం.. కనీసం పడుకోవడానికి మంచాలు కూడా సరిపోని ధైన్యం.. సరిపడా వైద్యులు లేక అవస్థలు.. శస్త్రచికిత్సలు అవసరమైతే ప్రైవేటు హాస్పిటళ్ల బాట పట్టాల్సిందే.. ఇదీ ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ఉన్న తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి పరిస్థితి. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలే కాకుండా మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి కూడా రోగులు ఇక్కడికి చికిత్స కోసం వస్తుంటారు. తాండూరు ప్రాంత పరిధిలో ఉన్న సిమెంటు కర్మాగారాలు, నాపరాతి గనుల్లోనూ, పాలిషింగ్ యూనిట్లలోనూ వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారు.
అక్కడ ఏ ప్రమాదం జరిగినా వారంతా జిల్లా ఆస్పత్రికే వస్తుంటారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మంచాలు లేకపోవడంతో వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. చేసేదేమి లేక ఎలాగోలా సర్దుకుని ఒకే మంచంపై ఇద్దరు పడుకుంటున్నారు. మెడికల్‌వార్డుల్లో పురుషులకు, మహిళలకు వేర్వేరుగా రెండేసి గదుల చొప్పున మొత్తం నాలుగు గదులు కేటాయించారు. ఒక్కో గదిలో 12 మంచాల చొప్పున మొత్తం 48 మంచాలున్నాయి. చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో సమస్యలు తప్పడం లేదు. ఒకే మంచంపై ఇద్దరు చొప్పున పడుకుంటే ఒకరి వ్యాధి మరొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రోగుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
భర్తీ కాని వైద్యుల పోస్టులు
ఆస్పత్రిలో అరకొర వైద్యులతో ఎలాగోలా నెట్టుకువస్తున్నారు. 200 పడకల ఆస్పత్రికి 9 మంది సివిల్ సర్జన్‌లు, 15 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్‌లు, ఇద్దరు అనస్థీషియన్లు ఉండాలి. ఇక్కడ మాత్రం ముగ్గురు సివిల్ సర్జన్‌లు, 8 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లు ఉన్నారు. ఇతర వైద్య సిబ్బంది సంఖ్య కూడా తక్కువగా ఉంది. అనస్థీషియన్లు అసలు లేనేలేరు. ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా అనస్థీషియన్లను తీసుకువస్తున్నారు.
ఈ మూడు రోజుల్లో మాత్రమే ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ కేసులు తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు గానీ లేదా తాండూరులోని ప్రైవేటు ఆస్పత్రులకు గానీ వెళ్లాల్సి వస్తోంది. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తక్షణమే స్పందించి ఆస్పత్రి సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.