సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న ‘ఫుడ్‌కోర్టు వెహికల్స్’ ఏర్పాటుకు వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలు, ట్రాఫిక్ పోలీసుల అనుమతి తలబొప్పిగా మారింది. పెద్దగా చదువుకోని వారు ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతుండటంతో ఆయా అనుమతులు తీసుకోవడం తెలియక చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే మారుతున్న జీవనశైలికి అనుగుణం గా చదువుకున్న వారు కూడా ఈ ప్రొఫెషన్‌ను ఎం చుకుంటుండడంతో చకచకా అన్ని అనుమతులు తీసుకొని వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఐటీ కారిడార్ జోన్‌లో అయితే ఈ ఫుడ్‌కోర్టు వెహికల్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్‌టీఏ, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలతో పాటు చివర్లో ట్రాఫిక్ పోలీసుల అనుమతిని తీసుకోవాలంటూ నాలుగేళ్ల క్రితమేపోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తుండటంతో కొంత ఇబ్బంది పడుతున్నారు.
ఎన్‌ఓసీల కోసం చక్కర్లే...
ఐటీ కారిడార్‌లో ఫుడ్‌కోర్టు వెహికల్ ఏర్పాటుచేసుకునేందుకు ఆర్‌టీఏ, జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక విభాగాల నుంచి నిరంభ్యంతర పత్రాలు తీసుకురావడం తలకుమించిన భారమవుతోందని ఫుడ్‌కోర్టు వెహికల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఎన్‌ఓసీలు రావాలంటే నెలలకొద్దీ సమయం పడుతుందని, ఇవన్నీ ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇస్తున్నారని చెబుతున్నారు. కష్టమైనా అన్నీ సమర్పిస్తున్నామని అంటున్నారు.
నాలుగేళ్ల క్రితం నియమాలనే కొనసాగింపు...
ఐటీ కారిడార్‌తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రహదారులపై విచ్చలవిడిగా వెలుస్తున్న ఫుడ్ కోర్టు వెహికల్స్, ఫుడ్‌కోర్టుల వల్ల రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో అప్పటి పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ వెండర్స్ సంబంధిత ఆర్‌టీఏ కార్యాలయం నుంచి కమర్షియల్ కేటగిరి కింద క్లోజ్‌డ్ బాడీతో మొబైల్ క్యాంటీన్ నిర్వహించే ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను తీసుకురావాలని, ఇటీవల రోడ్డు పన్ను చెల్లించిన రిసిప్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, అనుబంధ ప్రభుత్వ విభాగాల నుంచి ట్రేడ్ లైసెన్స్ తెచ్చుకోవాలని తెలిపారు. ఫుడ్ వెండింగ్‌కు ఈ వెహికల్ సరిపోతుందని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహరాన్ని అందిస్తామనే ఎన్‌ఓసీ సర్టిఫికెట్‌ను పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి పొందాలని చేర్చిన నిబంధనలను కొనసాగిస్తున్నామని సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఈ అనుమతులతో అందరికీ భద్రత...
ఉద్యోగుల ఆరోగ్య, భద్రత కోసం బిజినెస్ ఇన్సూరెన్స్ పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారం తినడం వల ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ అవడం, ఏదైనా ప్రకృతి విపత్తు సంభవించిన సందర్భంలోనూ ప్రజా బాధ్యత బీమా(పబ్లిక్ లియబులిటీ ఇన్సూరెన్స్)ను తీసుకోవాలని సూచించారు. వాట్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేసుకోవాలని అన్నారు. సంబంధిత జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నుంచి ఎన్‌వోసీ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. అధికారులు సూచించిన విధంగా అగ్నిమాపక యంత్రాలు అమర్చుకోవల్సి ఉంటుంది. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే ఉండాలి. గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ఏదైనా ప్రైవేట్ భూమిలో మొబైల్ వ్యాన్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తే సంబంధిత యజమాని నుంచి ఎన్‌వోసీ తీసుకరావాలి. సొంత స్థలంలో నిర్వహిస్తే సెల్ఫ్ డిక్లేరేషన్ ఇవ్వాలి.
అతిక్రమిస్తే చర్యలు
జీహెచ్‌ఎంసీ, ఆర్‌టీఏ, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీలు పొందాక సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఫుడ్ కార్ట్, ట్రక్, వ్యాన్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. కార్ట్‌లకు మెయిన్‌రోడ్డుపై 60 ఫీట్ల నుంచి 100 ఫీట్ల వరకు, అంతర్గత రహదారుల్లో 30 ఫీట్ల వరకు మాత్రమే అనుమతిస్తారు. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయి. మొబైల్ ఫుడ్ వెండర్స్ నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ట్రక్కులకు స్థల కేటాయింపు ఉంటుంది. 2015లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారమే అనుమతులు ఇస్తున్నాం.–వీసీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment