లారీ ఢీకొట్టడంతో నుజ్జు నుజ్జయిన ఆటో
సాక్షి,జనగామ: ఆటో రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ వెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపూర్ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్‌లో నివాసముంటున్న కె.హేమంత్‌హరిశ్రీకాంత్(23) ఆటో నడుపుతూ కటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితుడు రమేష్ వద్ద ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటో రిజిష్ట్రేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. దానిని తన పేర మార్పిడి చేసుకునేందుకు హేమంత్‌హరిశ్రీకాంత్ తన స్నేహితులు రమేష్, దాస్‌లతో కలిసి ఆటోలోనే ఉదయం వరంగల్‌కు బయలుదేరారు.
పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తున్నారు. యశ్వంతాపూర్ శివారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో ఎగిరి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్, దాస్‌లకు తీవ్ర గాయాలయాయ్యయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.విషయం తెలుసుకున్న హేమంత్‌హరిశ్రీకాంత్ భార్య దివ్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
తండ్రి కోసం ఏడాది కూతురు ఎదురు చూపు..
తండ్రి కనిపించపోవడంతో హేమంత్‌హరిశ్రీకాంత్ ఏడాది కూతురు బిక్కు బిక్కుమంటూ ఉండి పోయింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో తల్లి దివ్య రోదిస్తుంటే.. ఏం జరిగిందో తెలియని ఆ పసిపాప దీనంగా చూసింది. నాన్న ప్రేమకు దూరమైన చిన్నారిని చూసిన వారు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment