
ఫార్మా కంపెనీలకు పూర్తి రాయితీలు
జాతీయ ఫార్మా సదస్సులో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 11 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని... అందులో పెట్టుబడులు పెట్టే ఫార్మా కంపెనీలకు అవసరమైన పూర్తి రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ‘హైటెక్స్’లో ప్రారంభమైన 66వ జాతీయ ఫార్మాస్యూటికల్ సదస్సు (ఐపీసీ)లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఫార్మాసిటీలోనే ఉద్యోగులకు వసతి సౌకర్యం కల్పిస్తామని, అందులో ఫార్మా యూనివర్సిటీని నెలకొల్పుతామని చెప్పారు. పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే వారికి 30 రోజుల్లోగా ఏకగవాక్ష విధానంలో అనుమతులు ఇస్తామన్నారు. ప్రపంచ ఫార్మా రంగాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు కృషి చేస్తామన్నారు. సదస్సుకు 6 వేల మంది ప్రతినిధులు, 30 ఫార్మా దిగ్గజ కంపెనీల సీఈవోలు హాజరవడం హర్షణీయమన్నారు.
దేశంలో, రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అమలు చేస్తున్న విధానాలపై విస్తృతంగా చర్చించేందుకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ ఫార్మారంగంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గతంలో దేశ ఫార్మారంగం రూ. 100 కోట్ల టర్నోవర్ సాధిస్తే ప్రస్తుతం అది రూ. 10 వేల కోట్లు దాటిందన్నారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని 4,600 పరిశ్రమల ద్వారా 3.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.