ఏడేళ్లలో సరాసరి రోజుకో పిల్లర్‌ నిర్మాణం | Pillars Constructions Complete in Hyderabad Metro | Sakshi
Sakshi News home page

పిల్లర్‌ నెంబర్‌ 2599

Published Mon, May 20 2019 10:35 AM | Last Updated on Mon, May 20 2019 10:35 AM

Pillars Constructions Complete in Hyderabad Metro - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో తొలి దశలో తుది ఘట్టం ఆవిష్కృతమైంది. ఎల్బీనగర్‌ – మియాపూర్, జేబీఎస్‌ – ఎంజీబీఎస్, నాగోల్‌ – హైటెక్‌ సిటీ మార్గాల్లో (66 కి.మీ) చిట్టచివరి పిల్లర్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ అరుదైన ఘట్టానికి మహాత్మా గాంధీ బస్‌ స్టేషన్‌ (ఎంజీబీఎస్‌) చిరునామాగా నిలిచింది. ఇక్కడి మెట్రో స్టేషన్‌ సమీపంలోనే తుది పిల్లర్‌ (నెంబర్‌ 2599)ను ఇటీవల ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు, ఆస్తుల సేకరణసమస్యలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని కారుచీకటిలోకాంతిపుంజంలా దూసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టు నగరంలో ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి పిల్లర్‌ను 2012 ఏప్రిల్‌ 19న ఉప్పల్‌ జెన్‌ప్యాక్ట్‌ (పిల్లర్‌ నెంబర్‌ 19) వద్ద ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ... ఇటీవల ఎంజీబీఎస్‌ వద్ద ఏర్పాటు చేసిన చివరి పిల్లర్‌తో పూర్తయింది.

తొలి దశలో భాగంగా పాతనగరం ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా (6 కి.మీ) మినహా అన్ని రూట్లలో పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడంపై ఎన్వీఎస్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టుల శకంలో ఏకంగా 66 కిలోమీటర్ల మార్గంలో అన్ని పిల్లర్లు ఏర్పాటు చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. మెట్రో తొలి పిల్లర్‌ ఏర్పాటైనప్పటి నుంచి లెక్కిస్తే సరాసరి ఏడేళ్లలో రోజుకో పిల్లర్‌ ఏర్పాటు చేయడం మెట్రో ప్రాజెక్టు ఆవిష్కరించిన సరికొత్త రికార్డని హెచ్‌ఎంఆర్‌ తెలిపింది. కాగా పాతనగరంలో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా (6 కి.మీ) మార్గం మినహా మెట్రో తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తికానుందని పేర్కొంది. ఇక మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో, అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి రావడంతో పలు చోట్ల విభిన్న ఆకృతుల్లో అమర్చారు. మెట్రో ప్రాజెక్టును సాకారం చేయడంలో హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌ ఇంజినీరింగ్‌ హెడ్స్‌ ఎంపీ నాయుడు, శంకర్‌లింగం, కేఎం రావు, ఇతర ఇంజినీర్లు జియాఉద్దీన్, విష్ణువర్దన్‌రెడ్డి, రాజేశ్వర్, ఎ.బాలకృష్ణ తదితరులు విశేష కృషి చేశారు.

సవాళ్లు, రికార్డులివీ...
ప్రధాన రహదారులపై పిల్లర్ల ఏర్పాటుకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతుల కోసం మూడేళ్లు, రక్షణ శాఖ అనుమతుల కోసం నాలుగేళ్లు, రైల్వే అనుమతులకు నాలుగేళ్ల సమయం పట్టింది.
3 వేల ఆస్తుల సేకరణకు 370 కేసులను ఎదుర్కొని విజయం సాధించారు.
380 చోట్ల 200 కి.మీ మార్గంలో హెచ్‌టీ, ఎల్‌టీ విద్యుత్‌ కేబుల్స్‌ను తరలించారు. 25 కి.మీ రూట్లో సీవరేజీ లైన్లు, వాటర్‌లైన్లు, 5 వేల విద్యుత్‌ స్తంభాలను తరలించారు.
నిర్మాణ సమయంలో ఎదురైన అనేక ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించారు.
2,100 భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్‌ విధానంలో వేరే చోటుకు తరలించి వాటిని పరిరక్షించారు. మెట్రో కారిడార్లలో 6 లక్షల మొక్కలు నాటారు.
మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ నిర్మాణానికి వీలుగా వంపు తిరిగిన ప్రధాన రహదారిని సరళ మార్గంలో సవరించారు.
హైదర్‌నగర్, నిజాంపేట్‌ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా బైపాస్‌ దారులను ఏర్పాటు చేశారు.
జేఎన్‌టీయూ ప్రాంతంలో దేవాలయాలను తరలించి వేరొక చోట నిర్మించారు.
కేపీహెచ్‌బీ, మూసాపేట్‌ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను వేరొక చోటుకు తరలించారు.
ఐడీఎల్‌ దర్గా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు.
ఐడీఎల్‌ చెరువు వద్ద మతపరమైన కట్టడాలను వేరొక చోటుకు తరలించారు.
బాలానగర్‌లో సర్వీసు రహదారిని ఏర్పాటు చేశారు.
మలక్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్‌ ప్రాంతాల్లో అనేక అడ్డంకులను అధిగమించారు.
మూసాపేట్‌ ఆర్టీసీ డిపో వద్ద వరదనీటి కాల్వను డైవర్షన్‌ చేశారు.
భరత్‌నగర్‌ వద్ద భారీ కూరగాయల మార్కెట్‌ను వేరొక చోటుకు తరలించారు.
సుందర్‌నగర్‌కాలనీ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు.
ఈఎస్‌ఐ ఆస్పత్రి, విజయలక్ష్మి థియేటర్‌ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు.
ఎస్‌ఆర్‌నగర్‌ మక్బరా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు.
అమీర్‌పేట్‌ కాజ్‌వేను భారీగా విస్తరించి ఇంటర్‌ఛేంజ్‌ మెట్రో స్టేషన్‌ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు.
ఖైరతాబాద్‌ ఏడుగుళ్ల కూడలి వద్ద బైపాస్‌రోడ్డు ఏర్పాటుచేసి భారీ మెట్రో స్టేషన్‌ను నిర్మించారు.
రవీంద్రభారతి జంక్షన్‌ నుంచి పోలీస్‌కంట్రోల్‌ రూమ్‌ మార్గంలో అమరవీరుల స్తూపం, అసెంబ్లీ గౌరవానికి భంగం వాటిల్లకుండా మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేశారు.
పబ్లిక్‌గార్డెన్‌ వద్ద నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్‌ నాలాను దారిమళ్లించి పిల్లర్లు నిర్మించారు.
ఎంజీబీఎస్‌ వద్ద దోభీఘాట్, ఆర్టీసీ వర్క్‌షాప్‌లను తరలించి భారీ ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ను నిర్మించారు.
సుల్తాన్‌బజార్, బడీచౌడీ వద్ద వ్యాపారులతో సానుకూలంగా చర్చలు జరిపి మెట్రో పిల్లర్లు ఏర్పాటు చేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌ మార్గంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించారు.
ఒలిఫెంటా బ్రిడ్జీతో పాటు పలు రైల్వే బ్రిడ్జీల వద్ద అనేక ఇంజినీరింగ్‌ సవాళ్లను ఎదుర్కొని పిల్లర్లను ఏర్పాటు చేశారు.   

మెట్రో పిల్లర్లు ఇవీ.. రకం    సంఖ్య 
సాధారణ పిల్లర్లు    1569
కాంటీలీవర్‌           224
స్టేషన్‌ పిల్లర్లు       602
సుత్తె ఆకృతి        51
పోర్టల్‌ పిల్లర్లు    153
మొత్తం            2,599

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement