మియాపూర్ టు పంజగుట్ట | miyapur-panjagutta metro to run from 2016 | Sakshi
Sakshi News home page

మియాపూర్ టు పంజగుట్ట

Published Wed, Aug 19 2015 2:10 PM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

మియాపూర్ టు పంజగుట్ట - Sakshi

మియాపూర్ టు పంజగుట్ట

హైదరాబాద్: నగర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లు వచ్చే ఏడాది ప్రారంభంలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో పరుగులు తీయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా అనుకున్నట్టు నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో రాకపోకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ స్టేషన్ వరకు మార్గాన్ని పొడిగిస్తే వాణిజ్య పరంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్న అంచనాతో అక్కడ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే.

సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించాలంటే ఆలుగడ్డ బావి, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ వద్దనున్న రైల్వేట్రాక్‌ల పైనుంచి రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి. ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాక్‌ల పైనుంచి భారీ స్టీలు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఈ మూడు ఆర్‌ఓబీల నిర్మాణానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి దశలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో సుమారు 15 కి.మీ. పరిధిలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మూడు మెట్రో కారిడార్లు కలిసే అమీర్‌పేట్ వద్ద ఇంటర్‌ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు.ఎస్.ఆర్.నగర్‌లో మెట్రో స్టేషన్ అందుబాటులో ఉన్నందున ఈ మార్గంలో రాకపోకలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఎల్‌అండ్ టీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా ఎప్పు డు ప్రారంభించాలనే విషయంలో సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయమని మెట్రో రైలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నగర మెట్రో రైళ్లలో కనిష్టం గా రూ.10, గరిష్టంగా రూ.25 చార్జీని వసూలు చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు తెలిసిం ది. పొరుగునే ఉన్న చెన్నైలో కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 వసూలు చేస్తున్న విషయం విదితమే. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం.

తొలగని ప్రతిష్టంభన
అసెంబ్లీ వెనుక వైపు నుంచి మెట్రో మార్గం మళ్లించే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ.. సుల్తాన్ బజార్, కోఠి ఉమెన్స్ కళాశాల,పాత నగరంలో అలైన్‌మెంట్ మార్పుపై ప్రతిష్టంభన తొలగలేదు. సీఎం ఆదేశాల మేరకు పాతనగరంలో 3.2 కి.మీ. మార్గంలో మెట్రో అలైన్‌మెంట్‌ను పూర్తిగా మూసీ నది మధ్య నుంచే వేయాల్సి ఉంది. వాణిజ్య, సాంకేతిక పరంగా అవాంతరాలు ఎదురవుతాయని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ అధ్యయనంలో తేలినట్లు సమాచారం. సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లించేందుకు నిర్మాణ సంస్థ అధ్యయనం చేసి, రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. వీటిలో ఏదో ఒక మార్గానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో పనులు ఊపందుకుంటాయి.

60 కి.మీ. మేరకు ఊపందుకున్న పనులు
నాగోల్-రహేజా ఐటీ పార్క్, ఎల్బీ నగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా కారిడార్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతానికి 60 కి.మీ. మార్గంలో పనులు ఊపందుకున్నాయి. నాగోల్-సికింద్రాబాద్ స్టేషన్, మియాపూర్-పంజగుట్ట, మెట్టుగూడ-బేగంపేట్, బేగంపేట్-శిల్పారామం, ఎల్బీనగర్-నాంపల్లి మార్గాల్లో సుమారు 60 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లు, వాటిపై ట్రాక్‌ల ఏర్పాటుకు వయడక్ట్ సెగ్మెంట్లు, స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కోఠి-ఫలక్‌నుమా మార్గంలో పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం.

పార్కింగ్ స్థలాల అన్వేషణ షురూ...
మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రయాణికుల వాహనాలు పార్క్ చేసేందుకు మూడు కారిడార్ల పరిధిలో సుమారు 18 చోట్ల స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, తార్నాక, ఖైరతాబాద్, గడ్డిఅన్నారం, నాగోలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఖరారైనట్టుసమాచారం. ఇతర ప్రాంతాల్లోనూ అవసరమైతే ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు హెచ్‌ఎంఆర్ అధికారుల బృందం కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుందని ‘మెట్రో’ అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఎన్ని బస్సులు కొనుగోలు చేయాలన్న అంశంపై ఎల్‌అండ్‌టీ కసరత్తు చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement