వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో పరుగులు
జంటనగరాల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొత్తం 2017 జూన్ నాటికి పూర్తవుతుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్- సికింద్రాబాద్, మియాపూర్- పంజాగుట్ట మార్గాలలో మాత్రం వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే మొదలవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు లాభనష్టాలు లేని స్థితికి రావడానికి ముందు అనుకున్న సమయం కంటే ఒకటి రెండేళ్లు ఎక్కువ పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల మెట్రోపై మరీ అంత ఎక్కువ ప్రభావం పడలేదు గానీ, బ్రేక్ ఈవెన్కు వచ్చేందుకు మాత్రం ఒకటి రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రాజెక్టు ప్రారంభమైన నాలుగు- ఐదేళ్లలోనే బ్రేక్ ఈవెన్ వస్తుందని భావించామని, కానీ ఇప్పుడు ఆరేడేళ్లు పట్టేలా ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ మంచి వాణిజ్య కేంద్రమని.. ఇది ఎప్పటికీ మారదని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతున్నాయని, రెండు ప్రాంతాల్లో రూటు మార్పుకు సంబంధించి సాంకేతిక నివేదికలు ప్రభుత్వానికి చేరాయని ఆయన చెప్పారు. ముందు అనుకున్నట్లుగానే 2017 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు అంతా సిద్ధంగా ఉంటుందని, మెట్రో రైలు పరుగులు తీస్తుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.