
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ... రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా... రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు తీసింది. సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది.
రాత్రిపూట ఒంటరిగా స్టేషన్‌కు...
ఈ నెల 14న రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్–మియాపూర్ మార్గంలోని విక్టోరియా మెమోరియల్ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని అధికారులను వేడుకుంది. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు.
ఎల్బీ నగర్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్‌కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment