ప్రముఖ జర్నలిస్టు పిరాట్ల అస్తమయం
హైదరాబాద్: ప్రముఖ పాత్రికేయుడు, కృష్ణా పత్రిక పూర్వ సంపాదకుడు పిరాట్ల వెంకటేశ్వర్లు (74) సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని నారాయణగూడ శ్రీనివాస ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమారుడు కృష్ణకిశోర్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం ఎర్రగడ్డ ఈఎస్‌ఐ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1940 జూలై 16న కృష్ణాజిల్లా గన్నవరం మండలం వెన్నునూతలలో జన్మించిన పిరాట్ల 50 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తెలుగు భాషాభివద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సాహిత్యమన్నా, సంప్రదాయమన్నా ప్రాణమిచ్చేవారు. ముట్నూరి కృష్ణారావు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పిరాట్ల కృష్ణా పత్రికా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. 1983లో అప్పటికే మూసి ఉన్న కృష్ణాపత్రికను పునరుద్ధరించి సంపాదకునిగా పనిచేశారు. అంతకుముందు ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో జైలు జీవితం గడిపారు.
వైఎస్ జగన్ సంతాపం
పిరాట్ల మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణా పత్రిక పునరుద్ధరణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని ఒక ప్రకటనలో కొనియాడారు. పిరాట్ల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
పలువురి సంతాపం
పిరాట్ల మృతి పట్ల కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పిరాట్ల మృతి పత్రికాలోకానికి తీరని లోటని ఏపీడబ్ల్యుజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, టీడబ్ల్యుజేఎఫ్ అధ్యక్షుడు ఎం.సోమయ్యలు సంతాపం ప్రకటించారు.