ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. స్వీయ నియంత్రణే కరోనా వైరస్‌కు విరుగుడు అని వైద్యులు పదే పదే చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏకంగా వచ్చే నెల 14 వరకు స్వీయ నియంత్రణ పాటించాలని తేల్చి చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రజలు పాటించాల్సిన విధానాలు, సూచనలు చేశారు. 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి, సింగిల్ కుటుంబాలు ఎప్పుడూ లేనంతగా ఒకే దగ్గర 20 రోజులకుపైగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద కుటుంబాలైతే ఒకే దగ్గర ఉండటం వల్ల కొన్ని గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకే టీవీలో ఒకే సినిమా చూడాలంటే, ఒకే ఆట ఆడాలంటే అనేక ఇబ్బందులు, మనస్పర్థలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో కుంటుంబంలోని సభ్యులంతా వివిధ రకాల పనుల్లో ఉండటం వల్ల వచ్చే నెల 14 వరకు సంతోషంగా గడపొచ్చు.
చిన్న పిల్లలకు..
చిన్న పిల్లలను స్కూల్‌కు వెళ్లినట్లుగా ఉదయం పూటే నిద్రలేపాలి. వారికి టైం ప్రకారం టిఫిన్ అందించాలి. ఏవైనా టెక్స్‌బుక్స్ ఇచ్చి దానిని పూర్తి చేయాలని సూచించాలి. అదే విధంగా వివిధ రకాల బొమ్మలు, ఆటలు ఆడుకునేందుకు తగిన సమయం ఇవ్వాలి. కొన్ని గంటల పాటు క్యారంబోర్డు లాంటి ఆటలు ఆడించాలి. అదే సమయంలో ఫోన్లకు దూరం పెట్టడం ఎంతో మంచిదని, ఫోన్లకు అలవాటు పడితే అనేక ఇబ్బందులు వస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు.
పెద్దవాళ్లకు..
ఇంట్లో వారు రోజూ ఆఫీసుకు వెళ్లిన తర్వాత పెద్దవాళ్లు వాళ్లకు నచ్చిన టీవీ సీరియల్ లేదా సినిమా చూస్తారు. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి సీరియల్, నచ్చిన సినిమా పెట్టి వారికి కొంత సమయం కేటాయించాలి. ముందు జాగ్రత్తగా ఉదయం సమయంలోనే భోజనం అందించి, డాక్టర్లు సూచించిన మందులు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
జాయింట్ ఫ్యామిలీ..
ఉమ్మడి కుటుంబాలు అయితే ఇంటిపనుల్లో అందరూ తలోచేయి వే యాలి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా పనిని విభజించుకోవాలి. వంట లు, ఇంటి పనుల్లో అందరూ చేయి వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరికి వారు వదిలేస్తే కుటుంబాల్లో తగాదాలు వచ్చే ప్రమాదం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment