మొక్కలు పెంచు..చిక్కులు తుంచు | Plants minute pencucikkulu | Sakshi
Sakshi News home page

మొక్కలు పెంచు..చిక్కులు తుంచు

Published Sun, Sep 7 2014 12:53 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

మొక్కలు పెంచు..చిక్కులు తుంచు - Sakshi

మొక్కలు పెంచు..చిక్కులు తుంచు

రాయదుర్గం: రంగురంగుల మొక్కల పెంపకంతో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి శివారు ప్రాంతం అందంగా ముస్తాబైంది. నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్‌ఐఏబీ) సంస్థ ప్రాంగణం కొత్త రూపు సంతరించుకొంటోంది. 2.52 లక్షల మొక్కలను నర్సరీలో పెంచాలని తలపెట్టారు. వీటితోపాటు మరో 25వేల రకాల మెడిసినల్ మొక్కలను ప్రత్యేకంగా పెంచుతున్నారు.

ఈ ఏడాది మార్చిలో మొదటి విడతలో 60 వేల మొక్కలను పెంచగా, ప్రస్తుతం మరో 90వేల మొక్కలను పెంచుతూ మొత్తం 1.60 లక్షల మొక్కలతో నర్సరీని నిర్వహిస్తున్నారు. దశల వారీగా నర్సరీలో పెంచి సంస్థ ఆవరణలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేప్ కోసం వినియోగించాలని తలపెట్టారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన స్వయం ప్రతిపత్తి గల ఎన్‌ఐఏబీ సంస్థ కొన సాగుతోంది. ఈ సంస్థను గౌలిదొడ్డిలో 100 ఎకరాల ప్రాంగణంలో నిర్మించనున్నారు.
 
ఎస్‌ఎంపీబీ సహకారంతో మొక్కల పెంపకం..
 
గౌలిదొడ్డిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సంస్థ స్థలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్టేట్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ (ఎస్‌ఎంపీబీ) సహకారంతో నర్సరీని నిర్వహిస్తున్నారు. ఎస్‌ఎంపిబి ద్వారా మంజూరుచేసే నిధులతో 25వేల మెడిసినల్ మొక్కలను నర్సరీలో పెంచుతున్నామని ఎన్‌ఐఏబీ డెరైక్టర్ ప్రొఫెసర్ పి.రెడ్డన్న తెలిపారు. ఈ మెడిసినల్ మొక్కలను పెంచి వాటితో సాంప్రదాయ మందులను తయారుచేసి పశువులకు వినియోగించడం జరుగుతుందన్నారు.
 
ఎన్‌ఐఏబి ప్రాంగణంలో పెంచే మొక్కలివే...
 
గౌలిదొడ్డిలో ఎన్‌ఐఏబి ప్రాంగణంలో పెంచే మెడిసినల్ మొక్కలలో రెండ్ సాండర్స్, సాండల్ ఉడ్, టేకు, తులసి, మారేడు వంటి మొక్కలు అయిదేసి వేల చొప్పున మొత్తం 25వేల మొక్కలను పెంచుతున్నారు. వాటికి తోడుగా  పన్నెండు వేల చొప్పున మొత్తం 2.52 లక్షల మొక్కలైన మేలియా అజెడర్క్, ఇపోమియా ఎస్‌పి, ఓసిమమ్, పుడిలాంథస్, ఫిష్ టేల్ అండ్ ఫాక్స్ టేల్ పామ్స్‌తోపాటు మరో పదహారు రకాల మొక్కలను ఈ నర్సరీలో పెంచుతున్నారు. ఎన్‌ఐఏబిలో నిర్మాణాల చుట్టూరా, ఖాళీ స్థలాల్లో, రోడ్ల వెంబడి ఈ మొక్కలను పెంచుతామని సంస్థ డెరైక్టర్ రెడ్డన్న పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement