సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని తెలంగాణ హరిత వన ప్రత్యేకాధికారి పుష్పవర్గీస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్‌లో హరితవనం జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొక్కల పెంపకం కోసం 207 నర్సరీలను గుర్తించామని, వాటిలో 156 నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెంపకం ప్రారంభమైందని వెల్లడించారు.
మిగిలిన నర్సరీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 15వతేదీ కల్లా మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. ప్రజలు, స్వచ్ఛంధ సంస్థల భాగస్వామ్యంతో నివాస స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, పారిశ్రామిక వాడలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, స్థలాలతోపాటు రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కల పెంపకం చేపట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో ఓ స్మృతి వనం ఏర్పాటుచేసే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలన్నారు. ఇళ్లల్లో పెరటి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించి ఆసక్తి గల వారికి సంబంధిత శాఖల అధికారులే మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలని సూచించారు. చెరువులు, కుంటల గట్లపై ఈత, సిల్వర్ ఓక్స్ చెట్లను నాటేలా చూడాలన్నారు.
మొక్కలు నాటే కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు సర్పంచులతో ప్రత్యేకంగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలుచేసే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓలు నపీయుల్లా, నాగభూషణం, డ్వామా పీడీ చంద్రకాంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీఏ విజయ్‌కుమార్, హెచ్‌ఎండీఓ బయో డైవర్సిటీ డెరైక్టర్ కృష్ణ, ఉద్యానవనశాఖ ఏడీ ఉమాదేవి, పలువురు జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఉద్యమంలా హరితవనం
Published Tue, Dec 30 2014 11:05 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
Advertisement