మూడో విడత హరితహారానికి సన్నాహాలు
67 నర్సరీల్లో 1.26 కోట్ల మొక్కల పెంపకం
ఈత, ఖర్జూరా, హైబ్రిడ్ మునగ, బొప్పాయికి ప్రాధాన్యం
200 కిలోమీటర్ల వరకు ఎవెన్యూ ప్లాంటేషన్
ఓరుగల్లు :పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు.. అనే నినాదం స్ఫూర్తితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం మూడో విడత అమలు కోసం రూరల్ జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో రెండు విడతల్లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో వరంగల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో కొత్తగా ఏర్పాటైన వరంగల్ రూరల్ జిల్లాను ఈసారి మొదటి స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఇప్పటికే అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించడంతో పాటు మొక్కలు పెంచుతున్న నర్సరీలను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
67 నర్సరీల్లో పెంపకం..
జిల్లాలో వచ్చే సీజన్‌లో 1.08 కోట్ల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందుకోసం 67 నర్సీల్లో 1.26 కోట్ల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో 29, అటవీ శాఖ ఆధ్వర్యంలో 38 నర్సరీలు ఏర్పాటు చేశారు. అటవీశాఖ నర్సరీల్లో నాలుగు మాత్రమే ప్రభుత్వానివి కాగా, మిగతావి ప్రైవేట్ నర్సరీలు ఉన్నాయి. మొత్తం మొక్కల్లో 65 లక్షల టేకు ఉంటాయి. వీటితో పాటు కలెక్టర్ ప్రత్యేక చొరవతో హైబ్రీడ్ జాతి బొప్పాయి, మునగ విత్తనాలు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత సీజన్‌లో మేలు జాతి పండ్లు, పూల మొక్కలకుప్రజల నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా మొక్కలు పెంపకం చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈసారి ఎక్కువగా కడెం, తమిళనాడు ప్రాంతాల నుంచి హైబ్రీడ్ సీడ్ తీసుకొచ్చి మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
200 కిలోమీటర్ల వరకు ప్లాంటేషన్
జిల్లాలో సుమారు 200 కిలోమీటర్లకు తగ్గకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా ఎక్కువ నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. చెరువు కట్టలు ప్రభుత్వ స్థలాలు, గౌడ సొసైటీల భూముల్లో ఈత, ఖర్జూరా మొక్కలు, జిల్లా సరిహద్దు ప్రదేశాల వద్ద టేకు, ఇతర మొక్కలు నాటునున్నారు. అటవీ భూముల్లో అడవి జాతి మొక్కలు, నల్లమద్ది, మారేడు, ఉసిరి, జిన్న, ఏరుమద్ది వంటి మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించారు.
జూలై మొదటివారంలో....
వాతావరణం అనుకూలంగా ఉన్నట్లయితే జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని జూలై మొదటివారంలో ప్రారంభించవచ్చనే అంచనాతో అధికారులు పనులు చేస్తున్నారు. అప్పటివరకు నర్సరీల్లో మొక్కలు సుమారు 75 సెంటీమీటర్ల ఎదుగుదల ఉంటుందని అటవీ అధికారుల అంచనా. మొక్కల నాటుకునే విషయంలో ప్రజల డిమాండ్ మేరకు హైబ్రిడ్ వంగడాలు నర్సరీల్లో కొనుగోలు చేసి ఇచ్చేందుకు సైతం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మొక్కల పెంపకం బాధ్యతలు హార్టికల్చర్, సెరికల్చ ర్, ఎక్సైజ్, అటవీశాఖ, డీఆర్‌డీఓలు సమన్వయంతో పెంపకం చేపట్టనున్నారు.
వనంగల్
Published Fri, Jan 6 2017 10:53 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
Advertisement