జోరుగా ప్లాస్టిక్ బియ్యం దందా!
మీర్‌పేట్‌లో వెలుగుచూసిన ఘటన.. రంగంలోకి అధికారులు
హైదరాబాద్: ప్రజారోగ్యం వీధిన పడింది. వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి ప్రజలతో ఆటలాడుకుంటున్నారు. నగరంలోని ఓ దుకా ణాదారు ఆరోగ్యానికి హాని చేసే ప్లాస్టిక్ బియ్యాన్ని విక్రయిస్తున్న వైనం మంగళవారం వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కర్మన్ ఘాట్ డివిజన్‌లోని నందనవనంలో రాకేశ్ చౌదరి అనే వ్యక్తి దుర్గా జనరల్ స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాడు.
అక్కడే నివాసముంటున్న అశోక్.. రాకేశ్ చౌదరి దుకాణంలో నెల క్రితం బియ్యాన్ని కొనుగోలు చేశాడు. ఆ బియ్యాన్ని వినియోగిస్తున్నప్పటినుంచీ అనారోగ్యం బారిన పడుతుండటంతో అశోక్‌కు బియ్యంపై అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం ఆ బియ్యంతో వండిన అన్నాన్ని ముద్దగా చేసి గోడకు కొట్టడంతో అది బంతిలా తిరిగొచ్చింది.
దీంతో ఆ బియ్యం ప్లాస్టిక్ బియ్యమేనని నిర్ధారించు కున్న అశోక్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు కూడా సమాచారమివ్వగా దుర్గా జనరల్ స్టోర్స్‌తో పాటు ఆ ప్రాంతంలోని మిగతా కిరాణా దుకాణాలపై దాడులు నిర్వహించి బియ్యం నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. అశోక్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.