పెండింగ్ పనులు పూర్తి చేయండి
ప్రగతినగర్ : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత సమావేశంలో జిల్లాకు సంబంధించి రహదారుల మ్యాప్‌ను అందించాలని చెప్పినప్పటికీ సిద్ధం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్‌ఈ శంకరయ్య, ఈఈలు రాజేంద్రప్రసాద్, సీతారాములు, మాధవి, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఆలోచించండి..
స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్తగా మార్కెటింగ్ చేసి లాభదాయక వ్యాపారాలు నిర్వహించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ డీఆర్‌డీఏ, మెప్మా అధికారులకు సూచించారు. ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సంఘాలను కేవలం వరి, మొక్కజొన్న కొనుగోలుకు మాత్రమే పరిమితం చేయకుండా వారు ఏ రకమైన వ్యాపారాలు నిర్వహిస్తే లాభదాయకంగా ఉంటుందో సూచించాలన్నారు.
విద్యార్థుల యూనిఫారాలు, పెన్సిళ్లు, పాదరక్షలు, నోటుపుస్తకాలు, కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. మహిళ సంఘాలకు మంజూరు చేసే లింకేజీ రుణాలను ఇతర రుణాల బకాయిలను బదిలీ చేయకుండా బ్యాంకర్లకు సూచనలు చేయాలన్నారు. సంఘాలు బలోపేతం కావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి నిర్వహించాలి
నిజామాబాద్‌నాగారం: ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండల స్థాయిల్లో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు, ఆర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, సంబంధిత మండలాల్లోనే తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.