సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కోదాడలో కేరళ రెవెన్యూ కాలనీలోని సీనియర్ సిటిజన్లకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి రాష్ట్ర మానవహక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో సి.విద్యాధర భట్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ, ఐసీఎంఆర్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఓరల్ టెస్టింగ్ ల్యాబ్స్’ను ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ఈ అంశంపై ఆదేశాలివ్వాలంటూ ఆర్‌టీఐ, సామాజిక కార్యకర్త జలగం సుధీర్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదును విచారించి పై విధంగా స్పందించారు. కోవిడ్–19 పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోని పక్షంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి స్పందించవచ్చునని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌దారు కోరినట్టుగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment