
నర్సాపూర్ రూరల్: ఇక నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని, మద్యాన్ని తాగబోమని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేట గ్రామస్తులు సోమవారం గాంధీజీ చిత్రపటం ముందు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో అనేక మంది మద్యానికి బానిసలై, పనులు చేయకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పూర్తిగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీరిని ఆసరాగా చేసుకొని కొంతమంది గ్రామంలో విచ్చలవిడిగా మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. దసరా పండుగ సందర్భంగా సెలవులు రావడంతో పట్టణాలలో పనిచేసే ఉద్యోగులు, చదువుకునే యువకులు గ్రామానికి వచ్చారు. వారంతా కలసి గ్రామ పెద్దలతో చర్చించారు. వారంతా ముక్త కంఠంతో సై అనడంతో .. గ్రామంలో మద్యం అమ్మకాలను, మద్యపానాన్ని నిషేధిస్తూ మహాత్మాగాంధీ జయంతి రోజున తీర్మానం చేశారు.