
హే రాం.. మందు.. మాంసం విందు!
గాంధీ జయంతి రోజున ఎక్సైజ్ అధికారుల నిర్వాకం
నవాబుపేట: గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం వాడకాలు నిషిద్ధం. దీన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన వారే నిబంధనలు పక్కనబెట్టారు. మాంసం, మద్యంతో ఎక్సైజ్ అధికారులు విందు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో శుక్రవారం మద్యం అనర్థాలపై ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న ఎక్సైజ్ సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది.. తర్వాత నవాబుపేట దగ్గరలోని ఓ తోటలో మద్యం, మాంసంతో విందు చేసుకున్నారు.
విషయం తెలుసుకుని మీడియా అక్కడికెళ్లగానే పలాయనం చిత్తగించారు. గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం ముట్టకూడదు కదా? అని ప్రశ్నించగా, మాంసం తినడం నేరమా? అని అధికారులు ప్రశ్నించారు. సదస్సులో మద్యం మానమని ప్రమాణం చేయించామని, మాంసం మానమని కాదంటూ వెళ్లిపోయారు.