జిల్లాలోని రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వంలో ఇందూరు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వంలో ఇందూరు. జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందని అందరూ భావించారు. కనీసం రెండు మంత్రి పదవులైనా లభిస్తాయని ఆశించారు.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లలో ఇద్దరికి పదవులు వస్తాయన్న ప్రచారం జరిగింది. అయితే మొదటి విడతలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరికే అవకాశం దక్కడంతో అందరూ షాక్ తిన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు లభించకపోయినా.. విస్తరణలోనైనా అవకాశం లభిస్తుందన్న ఆశలో పలువురు నేతలున్నారు. మంత్రి పదవి కాకుండా కొందరు ప్రభుత్వ విప్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
మలివిడతపై..
తొలివిడతలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఒక్కరికే మంత్రిగా చాన్స్ రావడంతో మిగిలినవారు విస్తరణపై దృష్టి సారించా రు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కేసీఆర్.. అధికారం అప్పగిస్తే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లను అందలం ఎక్కిస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. ఇక బాజిరెడ్డి మిగిలి ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్‌లు కూడా మంత్రి పదవికోసం ప్రయత్నించినట్లు తెలిసింది.
అయితే జిల్లానుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో విస్తరణలో ఆ సామాజికవర్గానికి కాకుండా ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. దీంతో బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా డిప్యూటీ స్పీకర్ పోస్టు కోసం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ప్రభుత్వ విప్ కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి యత్నిస్తున్నట్లు సమాచారం. ఎవరి ఆశలు నెరవేరుతాయో వేచి చూడాలి.
‘పోచారం’ ప్రస్థానం
పరిగె శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి చెందినవారు. ఆయన 1950 ఫిబ్రవరి 10వ తేదీన జన్మించారు. ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే ఆపేసి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు.
1978లో దేశాయిపేట సింగిల్‌విండో చైర్మన్ ఎన్నికయ్యారు. 1981లో ఎల్‌ఎంబీ డెరైక్టర్, 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.
పోచారం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987, 1993-1997, 2005 -2007 లలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు.
1994, 1999లలో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, 1999-2000 భూగర్భ గనుల శాఖ మంత్రిగా, 2001-02 గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో స్టేషనరీ కుంభకోణం జరగడంతో నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ కోసం 2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. సీనియర్ నేత అయిన ఆయనకు కేసీఆర్ ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పగించారు.