ఖాకీ వనంలో.. కళాపుష్పం | Poet, writer, actor, successful head constable | Sakshi
Sakshi News home page

ఖాకీ వనంలో.. కళాపుష్పం

Published Wed, Jul 1 2015 11:49 PM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

Poet, writer, actor, successful head constable

కవిగా, రచయితగా, నటుడిగా
 రాణిస్తున్న హెడ్‌కానిస్టేబుల్
 మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, ఆడ పిల్లల అమ్మకాలు, వివిధ నేరాలపై ప్రదర్శనలు
  పలు అంశాల్లో అవార్డుల కైవసం
 తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో
 ఉత్తమ ఆర్టిస్ట్ అవార్డునందుకున్న దుర్గారెడ్డి
 
 చందంపేట : ఆయన చేస్తున్నది పోలీస్ ఉద్యోగం. నిత్యం ఏదో ఒక కేసులో బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా రంగ స్థల ప్రదర్శనలపై దృష్టి సారిస్తున్నారు. లాఠీలతోనో, తూటాలతోనే ప్రజలను మార్చలేమని భావించి కళారూపాల ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చని నమ్మారు. అందుకే సుమారు 300 ప్రదర్శనలు ఇచ్చి అధికారుల, రాజకీయ నాయకుల మెప్పు పొందారు. ఆయనే చందంపేట పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ మిర్యాల దుర్గారెడ్డి. దుర్గారెడ్డిది తిప్పర్తి మండలంలోని ఇందుగుల గ్రామం. ఆయన తల్లిదంద్రులు మిర్యాల వెంకట్‌రెడ్డి, లలిత.
 
 ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన దుర్గారెడ్డి చిన్ననాటి నుంచి ఆటల్లో మేటి. అలాగే హైస్కూల్లో చదువుకునే రోజుల్లోనే కవితలు, పాటలు రాయడం ఆరంభించారు. తనతల్లిదండ్రులనుంచి పుణికిపుచ్చుకున్న కళానైపుణ్యంతో అన్ని రంగాలలో రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. దుర్గారెడ్డి 1989లో పోలీస్‌శాఖలో చేరారు. నల్లగొండ పోలీస్‌శాఖలో స్థాపించిన ‘జాగృతి’ కళాబృందానికి ఇన్‌చార్జ్‌గా పని చేసి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పచ్చదనం- పరిశుభ్రత, నిరక్షరాస్యత, ధూమపానం, గుట్కా నమలడం, మూఢనమ్మకాలు, నక్సలిజం, వరకట్న నిషేధం, ఇలా ఎన్నో దురాచారాల పట్ల అనేక రూపకాలు, పాటలు రూపొందించి తద్వారా జన చైతన్యానికి తన వంతు బాధ్యత వహించారు. అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినాయాన్ని రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శించి ప్రశంసలందుకున్నారు.
 
  పోలీస్‌శాఖలో డీఐజీ ద్వారకా తిరుమలారావు, విశ్రాంత డీజీపీ చంద్రశేఖర్‌రెడ్డి, అప్పటి నల్లగొండ ఎస్పీలు శివధర్‌రెడ్డి, సజ్జన్నార్, బాలసుబ్రహ్మణ్యంలు దుర్గారెడ్డి రచనలను అభినందించి ప్రోత్సహించారు. తన రచనలకు స్పందించిన స్నేహ ఆర్ట్స్ దేవరకొండ వారు 1992లో అక్కడి గ్రంథాలయంలో సన్మానించా రు. 1994లో నల్లగొండ పట్టణంలో జరిగిన కవి సమ్మేళనంలో మహిళల సమస్యలపై చదివిన తన కవితకు ప్రశంసలు అందుకున్నారు. 2001లో సూర్యాపేటలో, 2003లో సాహితీమేఖల ఆధ్వర్యంలో ఘన సత్కారాలు పొందారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం చేసిన సేవలను పాటల రూపంలో అందించి ప్రశంసలను అందుకున్నారు.   రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో  దుర్గారెడ్డి పాటలకు అక్కడే ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ప్రశంసించారు.
 
 అవార్డులు
 2007లో ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన కార్యక్రమంలో యమధర్మనాటికలో ఎస్‌ఐ పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చింతల స్వచ్ఛంద సంస్థ తెలంగాణ ఉత్తమ రంగ స్థల నటుడు అవార్డుకు దుర్గారెడ్డిని ఎంపిక చేసి ప్రముఖ సినీగేయరచయిత సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా ఘనంగా సత్కరించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ చేతుల మీదుగా ఉత్తమ వ్యాసరచన పోటీలో పోలీసులకు, ప్రజల మధ్య సత్సంబంధాలపై వ్యాసం రాసి ఉత్తమ అవార్డును అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2న చందంపేట ఎంపీడీఓ కె. నర్సింహులు, తహసీల్దార్ కత్తుల ఏలేశం చేతుల మీదుగా ఉత్తమ ఆర్టిస్ట్‌గా అవార్డుతో పాటు 10వేల రూపాయల నగదును బహుమతిని అందుకున్నారు.
 
 వైఎస్సార్‌పై పాటల పుస్తకం
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాసిన పాటలతో ఓ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని గత నెల 11న తిప్పర్తి మండలం ఇందుగుల గ్రామానికి వచ్చిన దివంగత నేత వైఎస్సార్ తనయ షర్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా దుర్గారెడ్డిని షర్మిల అభినందించారు. త్వరలోనే ఆడపిల్లల అమ్మకాలపై, తెలంగాణకు హరితహారంపై పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు. ఇలా పోలీస్‌శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే కళారంగంలో రాణిస్తున్న దుర్గారెడ్డి పలువురికి ఆదర్శప్రాయంగాా నిలుస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement