పనితనం చూపకపోతే వేతనం కోతే! | Police And CID Employees Have To Show Their Skills | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 1:56 AM | Last Updated on Fri, Dec 21 2018 4:36 PM

Police And CID Employees Have To Show Their Skills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాలల్లో మంచి ఫలితాలు రాకపోతే టీచర్లు బాధ్యత వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. అదే రీతిలో ఇప్పుడు పోలీస్‌ శాఖ కూడా మెరుగైన ఫలితాలు రాకపోతే చర్యలు తీసుకునేందుకు వినూత్న కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వ్యవస్థను పోలీస్‌ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరాల నియంత్రణ, ముందస్తు చర్యలు, నేరస్తుల కట్టడికి టెక్నాలజీ ఆయుధాన్ని అందించింది. ఇంత చేస్తున్నా కొన్ని విభాగాల్లో ఆశించిన రీతిలో ఫలితాలు రావడం లేదు. దీంతో వారిపై చర్యలు తీసుకుంటేనే వ్యవస్థలో మార్పు వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.  

ముందుగా సీఐడీపైనే నజర్‌.. 
రాష్ట్రంలో తీవ్రత ఎక్కువగా ఉన్న నేరాలు లేదా సంచలనాత్మకంగా మారిన కేసుల దర్యాప్తు పర్యవేక్షించే రాష్ట్ర నేరపరిశోధన విభాగం (సీఐడీ)లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు పోలీస్‌ శాఖ కృషిచేస్తోంది. సీఐడీలో పనిచేస్తున్న వాళ్లకు 25 శాతం అదనపు వేతనం అందిస్తుంది. ఎందుకంటే ఇది శాంతి భద్రతల విభాగం కాకుండా సాధారణ నేరాలు, ఆర్థికమైన నేరాలు, సైబర్‌ క్రైమ్‌ నేరాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే విభాగం. కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు వరకు అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేస్తుంటారు. అయితే ఈ విభాగంలో ఆశించిన రీతిలో ఫలితాలు వెల్లడికాకపోవడం, ఏళ్లకేళ్లుగా కేసులు పెండింగ్‌లోనే ఉండటం, కేసుల్లో శిక్షల శాతం పెరగకపోవడం ఇలా అనేక రకాల సమస్యలు పోలీస్‌ శాఖను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి.

ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టాలంటే ఖచ్చితంగా ప్రతి దర్యాప్తు అధికారి బృందం టార్గెట్‌ రీచ్‌ అయ్యేలా ఉన్నతాధికారులు మానిటరింగ్‌ చేయాల్సి ఉంది. దీనికోసం కేసు దర్యాప్తులో పురోగతి చూపించడంతో పాటు కోర్టులో విచారణ వేగవంతం చేయించడం, శిక్షలశాతం పెంచేలా చర్యలు చేపట్టబోతున్నారు. వీటిలో ఏ ఒక్క దానిలో కూడా పురోగతి సాధించకపోతే రెండు నుంచి మూడు సార్లు నోటీసులందించడం, ఆ తర్వాత కూడా పనితీరు మెరుగు పడకపోతే ఈ విభాగంలో పనిచేస్తున్నందుకు వచ్చే 25శాతం అదనపు వేతనం కోత విధించేలా పోలీస్‌ పెద్దలకు సిఫారసు చేసేలా విభాగాధిపతులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.  

అకాడమీలో కచ్చితంగా.. 
పాఠశాలల్లో పిల్లలు సరిగ్గా చదివితేనే వారి భవిష్యత్‌తో పాటు సమాజ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడదే రీతిలో రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల వ్యవహారంపై దృష్టి పెట్టింది. అయితే వీళ్లకి ఏడాదిపాటు శిక్షణ ఇచ్చే అధికారులు, సిబ్బంది (ట్రైనర్లు) పనితీరుపై అకాడమీ పెద్దలు దృష్టి పెట్టారు. ఏడాదిపాటు సరైన రీతిలో శిక్షణ పొందితే సంబంధిత నూతన అధికారులు, సిబ్బంది పోలీస్‌ శాఖకు వన్నెతేవడంతో పాటు సమాజ భద్రతలో పూర్తిస్థాయిలో విజయం సాధిస్తారు. కాబట్టి ఇక్కడే ట్రైనర్లు లోతైన అధ్యయనం చేసి ఏవిధమైన శిక్షణ ఇవ్వాలి, ఔట్‌ డోర్‌ శిక్షణలో మెళకువలు పెంచడం, ఇండోర్‌లో లెగ్‌ వర్క్‌ చేయించడం, కేసు స్టడీస్‌పై అవగాహన కల్పించడం, సమాజంలో ఎవరితో ఎలా మెలగాలి, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్న అంశాలపై గ్రౌండ్‌ లెవల్లో నేర్పించాలి. ఇలాంటి వాటిలో సంబంధిత అధ్యాపకులుగా ఉన్న పోలీస్‌ అధికారులు మెరుగైన ఫలితాలు రాబట్టడంతో విఫలమైనా, సరైన రీతిలో శిక్షణ ఇవ్వకపోయినా అకాడమీ వారికి చెల్లిస్తున్న 15 శాతం అదనపు వేతనం కోతపెట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. రెండుసార్లు హెచ్చరిక నోటీసులు జారీచేయడం, జారీచేసిన అంశాలపై ముందస్తుగానే ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని మరీ చర్యలు చేపట్టేందుకు అకాడమీ పెద్దలు వర్క్‌ఔట్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే కొంత మంది ట్రైనర్లకు 15శాతం అదనపు వేతనం కోతపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement