- గస్తీ సిబ్బందికి స్పెషల్ జాకెట్లు, కొత్త వాహనాలు
- పంద్రాగస్టు నుంచి అమల్లోకి..
- పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించనున్న సీఎం
సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టు నుంచి ఉమ్మడి రాజధాని పోలీసులు సరికొత్త హంగులు సంతరించుకోనున్నారు. లండన్ పోలీసులకు దీటుగా ఇక్కడి పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కావాల్సిన కసరత్తు ప్రారంభించారు. కొత్త ఇన్నోవా, బైకులతోపాటు గస్తీ (పెట్రోలింగ్) పోలీసులు సరికొత్త డ్రెస్సులో కనిపించనున్నారు. వీటిని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభిస్తారు.
పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జంట పోలీసు కమిషనరేట్లకు 1650 ఇన్నోవా వాహనాలు, 1500 బైకులు ఖరీదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్ల నిధులను ఇటీవల విడుదల చేసింది. ఈ నిధుల నుంచి తక్షణం కొన్ని వాహనాలను ఖరీదు చేసి పంద్రాగస్టు నుంచి తిప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు కసరత్తు చేపట్టారు. పెట్రోలింగ్ కార్లు, బైకులు ఆకర్షణీయంగా ఉండేలా స్టిక్కర్లను రూపొందించారు.
ప్రత్యేక డ్రెస్ కోడ్...
ప్రస్తుతం ఉన్న పోలీసు డ్రెస్ కోడ్‌ను కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విదేశాలకు ఓ ప్రత్యేక బృందాన్ని పంపించి అధ్యయనం చేయించాలని అధికారులు నిర్ణయించినా ప్రస్తుత ం డ్రెస్ కోడ్ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే, పెట్రోలింగ్ పోలీసు సిబ్బందికి మాత్రం స్పెషల్ జాకెట్లు తయారు చేస్తున్నారు. డార్క్ బ్లూ కలర్‌లో ఈ జాకెట్లు రాబోతున్నాయి. పంద్రాగస్టు రోజు కొత్త వాహనాలపై బ్లూ జాకెట్లు ధరించిన పెట్రోలింగ్ పోలీసులు దర్శనమిస్తారు.
ఈ జాకెట్‌లో మ్యాన్‌పాక్, సెల్‌ఫోన్, చిన్నపాటి బుక్, పెన్ను, విజిల్ తదితర పోలీసులకు ఉపయోగపడే వస్తువులు పట్టే విధంగా రూపొందించారు. ఇప్పటి వరకు ఈ విధానం సైబరాబాద్ ఐటీ కారిడార్ పెట్రోలింగ్ పోలీసులకు మాత్రమే ఉంది. ఇకపై జంట కమిషనరేట్లలో గస్తీ పోలీసులు ఈ డ్రస్ కోడ్‌లోనే కనిపిస్తారు.