‘సుదీర్ఘ’ సమరం
ఉభయ సభల సమావేశాలు ప్రారంభం
27 రోజుల పాటు అసెంబ్లీ
ఆకర్షణీయంగా ముస్తాబైన ఎగువ సభ
చెరకు సమస్యపై దద్దరిల్లిన శాసన సభ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర ఉభయ సభల వర్షా కాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 30 వరకు 27 రోజుల పాటు సమావేశాలు జరుగనున్నాయి. బహుశా ఇటీవలి కాలంలో ఇంత సుదీర్ఘంగా సమావేశాలు జరగలేదు. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
నవ వధువులా ఎగువ సభ
కొత్త హంగులు, ఆర్భాటాలతో శాసన మండలి ఆకర్షణీయంగా తయారైంది. ఇటీవలే ఇందులో నవీకరణ చేపట్టారు. అందమైన విద్యుద్దీపాలు, అధునాతన మైక్‌లు, చూడ చక్కని సీటింగ్ ఏర్పాటు, సీసీ టీవీలు, పెద్ద టీవీ స్క్రీన్లతో సభ అచ్చు నవ వధువులా తయారైంది. నేలపై రెడ్ కార్పెట్ పరిచారు. కారిడార్‌లో కూడా కొత్తగా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే పాలక, ప్రతిపక్ష సభ్యులు ఈ ఏర్పాట్లపై ఆనందం వ్యక్తం చేస్తూ చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిని అభినందించారు.
సంతాప తీర్మానం
శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఇటీవల మరణించిన మాజీ సభ్యులు, నాయకులకు సంతాపం తెలియజేస్తూ తీర్మానాన్ని చేపట్టారు. లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ ఎస్. మల్లికార్జునయ్య, శాసన సభ మాజీ సభ్యులు కే. ప్రభాకర రెడ్డి, హెచ్ఎస్. శంకరలింగే గౌడ, ఏ. కృష్ణప్ప, మాజీ ఎంపీ ఐఎం. జయరామ శెట్టి, కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. జనార్దనరెడ్డి, నటుడు, దర్శకుడు సీఆర్. సింహ, సాగు నీటి రంగం నిపుణుడు జీఎస్. పరమ శివయ్య, సాహితీవేత్త యశవంత చిత్తాల, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సినిమా ఛాయాగ్రాహకుడు వీకే. మూర్తిల మృతికి సంతాప సూచకంగా ప్రవేశ పెట్టిన ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, జేడీఎస్ నాయకుడు వైఎస్వీ. దత్తా ప్రభృతులు మాట్లాడారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించి సభా కార్యక్రమాలు చేపట్టారు.
చెరకు ప్రతిధ్వనులు
సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం సభ ప్రారంభం కాగానే చెరకు రైతుల సమస్యలను విపక్షాలు లేవనెత్తడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వాయిదా తీర్మానం ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. చెరకు రైతులకు మద్దతు ధరను ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రభుత్వం చక్కెర మిల్లుల యాజమాన్యాలతో కుమ్మక్కైందని ఆరోపించారు. జేడీఎస్‌కు చెందిన వైఎస్వీ. దత్తా కూడా కష్టాల్లో ఉన్న చెరకు రైతులపై మాట్లాడడానికి చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విపక్షాల సభ్యులందరూ లేచి మాట్లాడడంతో గందరగోళం నెలకొంది.
ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకుని మాట్లాడుతూ చక్కెర కర్మాగారాల యాజమాన్యాలతో ప్రభుత్వం కుమ్మక్కు కాలేదని తెలిపారు. రైతులకు మద్దతు ధరను ఇప్పిస్తామని చెప్పారు. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనని చెప్పారు. చివరకు స్పీకర్ జోక్యం చేసుకుని ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై స్వల్ప వ్యవధి చర్చకు అవకాశం కల్పిస్తానని చెప్పడంతో గందరగోళానికి తెర పడింది. ప్రశ్నోత్తరాల అనంతరం జగదీశ్ శెట్టర్ చర్చను ప్రారంభించారు.