చౌటుప్పల్‌లో పోలీసులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు(ఫైల్)
ఆరోగ్యానికి హానికరంగా పరిణమించిన గుట్కాలను ప్రభుత్వం నిషేధించినా జిల్లాలో అమలు కావడం లేదు. గడిచిన ఆరు నెలల కాలంలో 31కి పైగా కేసులు నమోదవడం, రూ.కోట్లు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు పట్టుబడడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం నిఘా ఆశించిన స్థాయిలో లేకపోవడం కూడా గుట్కా వ్యాపారం జోరందుకోవడానికి కారణమని తెలుస్తోంది.
భువనగిరి : నిషేధిత గుట్కా వ్యాపారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. నిషేధించిన కొంతకాలం పాటు గుట్టుగా సాగిన వ్యాపారం మళ్లీ రెక్కలు విప్పుకుంది. జిల్లాలో పోలీసులు ఇటీవల భారీగా గుట్కాలను పట్టుకు న్న విషయం తెలిసిందే. పట్టుబడిన గుట్కాలకు సంబంధించి సరఫరా చేస్తున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పట్టణాలు గుట్కా వ్యాపారానికి అడ్డాలుగా మారాయి. పట్టపగలే సరఫరా జరుగుతున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెద్ద మొత్తంలో గుట్కాలు జిల్లాకు చేరుకుంటున్నాయి. జిల్లాలో గుట్కాల వ్యాపారం జోరుగా జరుగుతుందని చెప్పడానికి ఈసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 31కేసులు నమోదు కావడం ఇందుకు నిదర్శనం.
హైదరాబాద్ కేంద్రంగా..
ప్రజారోగ్యమే పరమావధిగా భావిస్తూ ప్రభుత్వం నిషేధించిన గుట్కా, జర్దా మాఫియా మళ్లీ పుంజుకుంటోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, రామంతాపూర్, పాతబస్తీ, ఎల్‌బీనగర్ ప్రాంతాల నుంచి గుట్కాలు జిల్లాకు సరఫరా అవుతున్నాయి. పోలీసులు, ఆహార నియంత్రణ ఆధీకృత విభాగం అధికారుల నిఘా కొరవడటంతో రోజూ లక్షల రూపాయల వ్యాపారం కొనసాగుతోంది.
బస్సుల్లో సరఫరా..
భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి కేంద్రాల నుంచి ప్రతి రోజూ సుమారు 70 నుంచి 120 మంది అక్రమార్కులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి గుట్కాలను జిల్లాకు తీసుకువస్తున్నారు. అక్రమార్కులు తాము కొనుగోలు చేసిన గుట్కాలను ఎవరికీ అనుమానం రాకుండా బట్టల బ్యాగుల్లో బిగించుకుని ఆర్టీసీ బస్సులో ఎక్కుతున్నారు. ఇలా బస్సుల్లో వచ్చి బస్టాండ్‌కు కొంత దూరంలో ఉన్న స్టేజీల వద్దనే దిగుతున్నారు. అనంతరం వాటిని రహస్య ప్రాంతాల్లో నిల్వ ఉంచుతున్నారు. అక్కడి నుంచి చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నారు. చిన్న వ్యాపారుల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. గుట్కాలను ప్రధానంగా టీస్టాల్స్, పాన్‌షాపులు, కిరాణం, దాబాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు.
రోజుకు రూ.లక్షల్లో వ్యాపారం..
జిల్లాలో 7,39,448జనాభా ఉంది. ఇందులో గుట్కాలు తినే అలవాటు సుమారు 5శాతం మందికి ఉంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 36,972మంది గుట్కాలు అమ్ముడవుతుండగా సగటున ఒక్క వ్యక్తి రోజుకు రెండు గుట్కాల చొప్పున తినేస్తున్నాడు. రూ.5 ఉన్న గుట్కాను రూ.10కి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 73,944 గుట్కా ప్యాకెట్లను తీసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.దీని ప్రకారం రోజూ రూ.7,39,440 విలువ చే సే వ్యాపారం జరుగుతుంది. ఒక్క నెలలో రూ. 22,18,3200 వ్యాపారం జరగగా ఏటా 26.61కోట్ల బిజినెస్ నడుస్తుంది.
జిల్లాలో పట్టుబడిన గుట్కాల వివరాలు కొన్ని..
- ఈనెల 20వ తేదీన భువనగిరి పట్టణంలో రూ.1.72లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
- ఈనెల 18న భువనగిరిలోని అర్బన్‌కానీలో రూ.18వేలు విలువ చేసే గుట్కాలను విక్రయిస్తుండగా పట్టుకున్నారు.
- బీబీనగర్ మండలం నెమురగోములలో ఫిబ్రవరిలో రూ.2లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.
- ఈనెల 18వ తేదీన చౌటుప్పల్ మండల కేంద్రంలో రూ.20విలువ చేసే గుట్కాలను పట్టుకున్నారు.
వీటితోపాటు జిల్లాలో మొత్తం 31కేసులు నమోదు చేయగా 31మందిని అరెస్టు చేశారు.
కేసులు నమోదు చేస్తాం
జిల్లాలో నిషేధిత గుట్కాలు విక్రయించిన, కొనుగోలు చేసిన గుట్కాలను సరఫరా చేయడంలో మధ్యవర్తిత్వం వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో గుట్కాలు విక్రయించే వారి దుకాణాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాం. అవసరమైతే ప్రత్యేక దాడులు నిర్వహిస్తాం.
– భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment