గుట్కా గుట్టురట్టు | Gutka Gang Arrest | Sakshi
Sakshi News home page

గుట్కా గుట్టురట్టు

Published Wed, Apr 11 2018 1:01 PM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

Gutka Gang Arrest - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రంగనాథ్, నిందితులు, గుట్కాప్యాకెట్లను చూపుతున్న ఎస్పీ

నల్లగొండ క్రైం :నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.54,67,800 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ దందాకు సబంధించిన వివరాలను ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఓ ముఠా ఢిల్లీ, గుజరాత్, సూరత్, హైదరాబాద్‌ కేంద్రాలుగా చేసుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నిషేధిక గుట్కాలు సరఫరా చేస్తోంది. ఈ ముఠాలో 8 మంది సభ్యులు ఉండగా.. ఆరుగురిని అరెస్టు చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ముఠా సభ్యులు వీరే..
రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌బాటియా రంగారెడ్డి జిల్లాలోని రాటోరికూవనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఢిల్లీకి చెందిన రంజన్‌గుప్త, సూరత్‌కు చెందిన అశోక్, హైదరాబాద్‌ రామాంతాపూర్‌కు చెందిన విసంశెట్టి సాంభశివ, హైదరాబాద్‌కు చెందిన దొంతం రాజశేఖర్‌రెడ్డి, గోల్‌కొండకు చెందిన వాసీం పాట్ని, రాజేంద్రనగర్‌కు చెందిన ఎండీ జుబ్బార్‌మహ్మద్, మిర్యాలగూడ సీతారాంపురానికి చెందిన కందుకూరి శ్రీనివాస్‌ ముఠాగా ఏర్పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కా ప్యాకెట్లు తెచ్చి హైదారాబాద్‌లోని కాటేదాస్‌లోని మావైష్ణవి గోదాము, మదీనాలోని బాటో గోదాములో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాం తాలకు వాటిని సరఫరా చేసేవారు. ఈ ముఠా సభ్యులకు  వ్యాపారాలు, ట్రాన్స్‌పోర్ట్‌లు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

పట్టుబడింది ఇలా..!
జిల్లాలోని మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్‌గేట్‌ వద్ద మిర్యాలగూడెం వైపు వెళ్లే వాహనాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడకు చెందిన కందుకూరి శ్రీనివాస్‌ తన కిరాణ షాపులోకి సామాను తెచ్చే సంచులను తనిఖీ చేయగా çగుట్కా ప్యాకెట్లతో పట్టుబడ్డాడు. శ్రీనివాస్‌ను విచారించగా హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో విసంశెట్టి సాంభశివ, దొంతం రాజశేఖర్‌రెడ్డి నడిపిస్తున్న మా వైష్ణవి గోదాము నుంచి తెచ్చినట్లు వెల్లడించాడు. గోదాము వారిని విచారించగా.. బాటో గోదాము వివరాలు కూడా వెల్లడయ్యాయి. దీంతో ఈ దందాతో సంబంధం ఉన్నవారిని గోదాముల వద్దనే అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారంతో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన రంజన్‌ గుప్త, సూరత్‌కు చెందిన అశోక్‌ పరారీలో ఉన్నారు. జిల్లాలో గంజాయి క్రయ విక్రయాలపైన çఉక్కుపాదం పెడతామని ఎస్పీ వెల్లడించారు. అక్రమవ్యాపారాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కేసును పరిశోధించిన మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐలు సైదాబాబు, విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్‌ రమణారెడ్డి, పీసీలు రబ్బాని, భాస్కర్, ముత్తిలింగం, లింగరాజును ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement