అవి చూసి కాల్‌ చేస్తే నిండా మునిగినట్లే | Police Awareness on Fake Customer Care Numbers in Google | Sakshi
Sakshi News home page

నష్టమర్‌ కేర్‌

Published Fri, Jul 17 2020 8:01 AM | Last Updated on Fri, Jul 17 2020 2:43 PM

Police Awareness on Fake Customer Care Numbers in Google - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఫోన్‌కు రూ.550 రీచార్జ్‌ చేయించారు. ఆ మొత్తం యాడ్‌ కాకపోవడంతో ఆ సర్వీస్‌ ప్రొవైడర్‌ సంస్థను సంప్రదించడానికి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం ప్రయత్నించారు. గూగుల్‌లో కనిపించిన ఓ నెంబర్‌కు కాల్‌ చేయగా... ఆ మొత్తం రీఫండ్‌ చేస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు బ్యాంకుఖాతా వివరాలు సంగ్రహించారు. వీటిని వినియోగించి ఆమె ఖాతా నుంచి రూ.54,500 కాజేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. 

ప్రజలకు టోకరా
వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్‌ నేరగాళ్లు ఇటీవల కాలంలో ఈ పంథాలో టోకరా వేస్తున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఆ అంతర్రాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టిస్తున్నారు. ప్రతి నెలా కనిష్టంగా రూ.20 లక్షల వరకు టోకరా వేస్తున్నారు. 

బోగస్‌ వివరాలతో సిద్ధం చేసి...
ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్‌ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్‌ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరైతే బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారుల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రోనగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యవతకు కమీషన్‌ ఆశ చూపుతున్న సైబర్‌ నేరగాళ్లు వారి వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందని మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్, బ్యాంక్‌ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఐదు శాతం చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు. సిమ్‌కార్డులు, బేసిక్‌ మోడల్‌ సెల్‌ఫోన్లతో పాటు బ్యాంకు ఖాతాలు, యాప్స్‌ సిద్ధమయ్యాక ఈ సైబర్‌ నేరగాళ్లు అసలు అంకం మొదలు పెడుతున్నారు. 

గూగుల్‌లో రిజిస్టర్‌ చేసుకుని...
ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్‌లోకి ఎంటర్‌ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా తమ నెంబర్లను ఆయా బ్యాంకులకు, ఆయా సంస్థలకు చెందిన కాల్‌ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ‘బ్యాంక్‌’, ‘బ్యాంక్‌ మేనేజర్‌’ లేదా ఫలానా సంస్థ పేర్లతోనే రిజిస్టర్‌ చేసుకున్నారు. గూగుల్‌ సెర్చ్‌లో పొందుపరిచిన వారిలో వేటికి వ్యూస్‌ ఎక్కువగా ఉంటే అది పై భాగానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు సైబర్‌ నేరగాళ్లు తమ అనుచరుల ద్వారా ఆయా నెంబర్లకు వ్యూస్‌ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు తన బ్యాంక్‌నకు సంబంధించిన కాల్‌ సెంటర్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచినవే ముందు కనిపిస్తుంటాయి.  

 పరిష్కారం పేరుతో ఎం.పిన్‌ పంపిస్తూ...
ఇలా కనిపించిన ‘కాల్‌ సెంటర్‌’ నెంబర్‌కు ఖాతాదారుడు కాల్‌ చేసిన వెంటనే అది సదరు సైబర్‌ నేరగాడికి చేరిపోతుంది. తాను బ్యాంక్‌ మేనేజర్‌ అని, ఫలానా సంస్థ ప్రతినిధి అని అంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నెంబర్‌ నుంచి ఓ ఎస్సెమ్మెస్‌ పంపుతామని, దాన్ని మళ్లీ అదే నెంబర్‌కు సెండ్‌ చేయాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు నెరపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటూ యూపీఐగా పిలిచే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్‌ అయి ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌నకుసంబంధించిన నెంబర్‌కు పంపాల్సి ఉంటుంది.దీన్నే ఈ సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగామార్చుకుంటున్నారు.

యాప్స్‌ను అనుసంధానిస్తూ...
తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఉంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఇలా కాల్‌ వచ్చినప్పుడు ఎంపిన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్‌ చేసిన ఖాతాదారుడికి వేరే నెంబర్‌ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను అదే నెంబర్‌కు సెండ్‌ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్‌ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నెంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్‌ చేయడంతో పాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్‌ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్‌ ఖాతాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతా లేదా ఈ వ్యాలెట్‌ వివరాలు, పిన్‌ నెంబర్లు సంగ్రహించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.  

ఆ వివరాలు కోరితే అనుమానించాల్సిందే
సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీరిలోఅత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఏ బ్యాంకైనా.. సంస్థకస్టమర్‌ బ్యాంకు ఖాతాకు, ఈ–వాలెట్స్‌కు సంబంధించిన వ్యక్తిగత సమాచారం అడగదు. అలా ఎవరైనా చెప్పమన్నారంటేఅనుమానించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిన్‌ను ఎవరి సెల్‌ నెంబర్‌కు పంపకూడదు. గూగుల్‌లో చూసినవి అన్నీ నిజమైన కాల్‌ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. గూగుల్‌ పే పేరుతోనూ గూగుల్‌లో నకిలీ నెంబర్లు ఉంటున్నాయి. అపరిచితులు, ఫోన్‌ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు
చేయకపోవడం ఉత్తమం. – కేవీఎం ప్రసాద్, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement