సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌లో నకిలీ కాల్ సెంటర్ నెంబర్లు జోప్పించి, ఫోన్లు చేసిన వారిని నిండా ముంచుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌లో పట్టుకున్న వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్ లైమ్ రోడ్ యాప్‌లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండటంతో టీషర్ట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఒక్క టీషర్టే రావడంతో ఆ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నెంబర్‌కు కాల్ చేయగా... కట్ చేసిన అవతలి వ్యక్తి మరో నెంబర్ నుంచి సంప్రదించాడు. లైమ్‌రోడ్డు ప్రతినిధిగా పరిచయం చేసుకున్న అతడికి విషయం చెప్పగా మీ సమస్య పరిష్కారం కావడానికి మేము పంపే లింక్ తమ కేంద్ర కార్యాలయానికి చెందిన నెంబర్‌కు పంపాలంటూ చెప్పి ఆ నెంబర్ ఇచ్చారు.
కొద్దిసేపటికి వచ్చిన లింకును అర్జున్ ఆ నెంబర్‌కు పంపాడు. ప్రాసెస్ పూర్తి కావడానికి అంటూ బాధితుడి నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. దీంతో ఇతడి బ్యాంకు ఖాతా, సైబర్ నేరగాళ్ళ ఫోన్‌కు లింకు అయింది. దీనిసాయంతో వాళ్ళు రూ.37,288 కాజేశారు. బాధితుడు ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్ సాంకేతిక ఆధారాలను బట్టి జార్ఖండ్‌కు చెందిన మన్సూర్ అన్సారీ, అస్లం రజాలకు ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ నిందితుల్లో ఒకరైన మన్సూర్ అన్సారీ జార్ఖండ్‌లోని పిప్రా గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అస్లం తదితరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment