స్నేహితుడే హంతకుడు | police caught the Murderer | Sakshi
Sakshi News home page

స్నేహితుడే హంతకుడు

Published Sat, Sep 13 2014 11:52 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

స్నేహితుడే హంతకుడు - Sakshi

స్నేహితుడే హంతకుడు

* భార్య విషయమై హేళనగా మాట్లాడాడని హత్య
* వారంరోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు  
* వివరాలు వెల్లడించిన సీఐ ప్రసాద్


పరిగి: యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్య విషయమై హేళనగా మాట్లాడాడని ఓ వ్యక్తి స్నేహితుడిని చంపేశాడు. పోలీసులు శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. పరిగి సర్కిల్ కార్యాలయంలో దోమ ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. పరిగికి చెందిన ఖుర్షీద్(26) స్థానిక బస్‌స్టాండ్ సమీపంలోని ఓ పూల దుకాణంలో రోజుకూలీగా పనిచేస్తున్నాడు. సమీపంలోని చెప్పుల దుకాణంలో పరిగికే చెందిన ఆహ్మద్‌పాషా పనిచేసేవాడు.
 
వీరిద్దరు స్నేహితులు. పనులు ముగించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి తరచూ మద్యం తాగుతుండేవారు. చాలా కాలం తర్వాత ఈనెల 4వ తేదిన సాయంత్రం ఖుర్షీద్, అహ్మద్‌పాషా కలుసుకున్నారు. అప్పటికే ఇద్దరూ మద్యం తాగి ఉన్నారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో వారిద్దరు తిరిగి మద్యం తాగారు. అనంతరం ఒకరిబాధలు మరొకరు పంచుకున్నారు. ఈక్రమంలో కొంతకాలం క్రితం తన భార్య పుట్టింటికి వెళ్లి.. తిరిగి రావడం లేదని అహ్మద్ పాషా తన స్నేహితుడు ఖుర్షీద్‌తో చెప్పాడు. దీంతో అతడు అవహేళన చేశాడు. ఎవరితోనే వివాహేతర సంబంధం పెట్టుకుని ఉంటుంది.. అందుకే రావడంలేదని కించపరుస్తూ మాట్లాడాడు. తన భార్య అలాంటిది కాదని అహ్మద్‌పాషా వాదించాడు.
 
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయినా ఖుర్షీద్ అలాగే అవహేళన చేశాడు. ఈక్రమంలో అహ్మద్‌పాషా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎలాగైనా ఖుర్షీద్‌ను చంపేయాలనుకున్నాడు. అంతలోనే పథకం వేసిన అతడు మరికొంత మద్యం తెప్పించా డు. అనుకున్న ప్రకారం ఖుర్షీద్‌కు ఎక్కువ మోతాదులో తాగించాడు. అదే సమయంలో ఖుర్షీద్ అహ్మద్‌పాషా నుంచి సెల్‌ఫోన్ తీసుకుని అందులోనుంచి సిమ్‌కార్డు తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. అనంతరం రాత్రి 11 గంటల తర్వాత అహ్మద్‌పాషా తన బైక్‌పై ఎక్కించుకొని ఖుర్షీద్‌ను దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి శివారుకు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కింద తోసేసి తలపై బండరాయితో మోది చంపేసి అక్కడినుంచి పరారయ్యాడు.
 
కేసు ఇలా ఛేదించారు..
మరుసటి రోజు ఈనెల 5న హత్య విషయం వెలుగుచూసింది. స్థానిక రైతుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పక్కనే పడిఉన్న సిమ్‌కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు పత్రికల్లో హత్య విషయం రావడంతో కుటుంబీకులు ఖుర్షీద్‌ను గుర్తించారు. పోలీసులు సిమ్‌కార్డు గురించి ఆరా తీసి అహ్మద్‌పాషా అడ్రస్‌తో ఉందని గుర్తించారు.

అనంతరం పరిగిలో విచారణ జరపగా హత్య జరిగిన రోజు రాత్రి అహ్మద్‌పాషా, ఖుర్షీద్‌లు కలిసి ఉన్నారని తెలుసుకున్నారు. అనంతరం అహ్మద్‌పాషా కోసం పోలీసులు వేట ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం నిందితుడిని పరిగిలో అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారణ జరుపగా ఖుర్షీద్‌ను తానే చంపానని అహ్మద్‌పాషా అంగీకరించాడు. తన భార్య గురించి హేళనగా మాట్లాడినందుకే ఖుర్షీద్‌కు హతమార్చినట్లు చెప్పాడు. పోలీసులు శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement