మిస్‌ఫైర్
నార్నూర్/జైనూర్ : స్పెషల్ పార్టీ పోలీసు గన్ మిస్‌ఫైర్ అయింది. ఆ బుల్లెట్ ఖాళీ కోక్ సమీపంలో పండ్లు కొంటున్న గిరిజనుడికి తగలడంతో అతడికి గాయాలయ్యాయి. బాధితుడిని పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వాహనంలో బయల్దేరడంపై గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ఆగ్రహించారు. వాహనాన్ని అడ్డుకొని సిబ్బందిని నిలదీశారు. ఠాణా ముట్టడించి ఐదుగంటలపాటు ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్-యు మండలం లింగాపూర్ అటవీ ప్రాంతంలో కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు సోమవారం కూంబింగ్ నిర్వహించారు.
మధ్యాహ్నం జైనూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని స్వీట్‌హౌస్ షెడ్డు కింద కూర్చుని నీళ్లు తాగుతుండగా స్పెషల్ పార్టీకి చెందిన కరుణాకర్ నిర్లక్ష్యంతో అతడి తుపాకి మిస్‌ఫైర్ అయింది. పక్కనే పండ్లు కొంటున్న జైనూర్‌కు చెందిన కనక అరుణ్ వెంకటేశ్‌కు బుల్లెట్ ఖాళీ కోక్ తగిలి తలకు గాయమైంది. గన్ పేలిన శబ్దానికి స్థానికులు తలోదిక్కుకు భయంతో పరుగులు తీశారు. అయితే గాయపడిన యువకుడిని పట్టించుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు ఆర్టీసీ బస్సు ఎక్కి ఆసిఫాబాద్ బయల్దేరారు.
వీరి తీరుపై ఆగ్రహించిన గిరిజన సంఘాల నాయకులు మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో వారి బస్సును అడ్డుకున్నారు. వారిని నిలదీశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. యువకుడి సంరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని సీఐ రఘు హామీ ఇచ్చారు. వినిపించుకోని గిరిజనులు బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు ఠాణాను ముట్టడించారు. సుమారు ఐదుగంటల పాటు స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఐ సూచనల మేరకు గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిబ్బందిపై కేసునమోదు చేశారు. వెంకటేశ్ చికిత్స నిమిత్తం రూ.5 వేలు అందించారు. చికిత్సకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. సీఐ వెంట కూబింగ్ పార్టీ ఎస్సై స్వామి ఉన్నారు.