special party
-
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
సీఐఐ సదస్సులో మద్యంతో మజాలు
-
ఏపీ సర్కారు మరో నిర్వాకం..!
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో పెటుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది. పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం, విందులు వినోదాలకు వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విశాఖలో భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా విశాఖలో అత్యంత రద్దీగా ఉండే వుడా పార్క్‌కు సమీపంలోని ఎంజీఎం పార్క్‌లో శనివారం రాత్రి మందు, విందు ఏర్పాట్లు భారీగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విందులో అతిథులను ఆకట్టుకోవడానికి ఆటపాటలను కుడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం బాలీవుడ్ నుంచి నృత్యకారిణులు, పాప్ గాయకులను పిలిపించారు. అంతేకాదు వీటితో పాటు పలు విలాసవంతమైన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను అలరించే బాధ్యతను ఈ-ఫాక్టర్ అనే సంస్థకు అప్పగించారు. గత నాలుగేళ్లుగా లక్షల కోట్ల పెట్టుబడులంటూ బాకా మోగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీకీ ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయో తెలీదు కానీ ఈ సమావేశాల పేరుతో మాత్రం ప్రజాధనాన్ని యధేచ్ఛగా ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. -
నల్లమలలో కూబింగ్‌కు ‘స్పెషల్’ బృందాలు
కర్నూలు: నల్లమల అటవీ ప్రాంతంలో కూంబింగ్ కోసం స్పెషల్ పార్టీ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో సివిల్ , ఏఆర్ సిబ్బంది నిర్వహించిన కవాతును ఎస్పీ పరిశీలించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 2013 బ్యాచ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లను జిల్లా కేంద్రానికి పిలిపించి వారి వయస్సు, వ్యక్తిగత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ పార్టీ బృందాలుగా వారిని ఏర్పరిచి.. ఫిట్నెస్ కోసం మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్ఐలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వీవీఐపీల కదలికల సమాచారాలను యూనిట్ ఆఫీసర్లకు అందించాలన్నారు. వీఐపీలకు రక్షణ కల్పించాలన్నారు. ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఒబేసిటీ తరగతులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు డీవీ రమణమూర్తి, వెంకటాద్రి, సీఐలు నాగరాజురావు, మధుసూదన్‌రావు, ఆర్ఐలు జార్జ్, రంగముని, రామకృష్ణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీల కోసం ప్రత్యేక పార్టీ- ఆర్ కృష్ణయ్య
రామాయంపేట: బీసీల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదని, ఆ దిశగా ముందుకు వెళుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట వద్ద రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏపార్టీ కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బీసీలకు ప్రజాస్వామ్య ఫలాలు దక్కడంలేదని, తమకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలలో 2,600 ఉప కులాలుండగా, ఇందులో 2,550 కులాలకు పార్లమెంటులో అసలు ప్రాతినిథ్యం దక్కలేదన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల్లో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. జనాభా ప్రాతిపాదికన రాష్ట్రంలో బీసీకి చెందినవారు 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా, 19 మంది మాత్రమే ఉన్నారన్న ఆయన ఎనిమిదిమంది ఎంపీలకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 2019 వరకు తాము రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. ఈమేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. -
ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు
తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ దళాలు ఘటనాస్థలికి వెళ్లిన తమిళనాడు పోలీసులు సూర్యాపేట బస్టాండ్‌లో ముంబై ఏటీఎస్ స్క్వాడ్ తనిఖీలు దర్గా దగ్గరకు కూడా..! పది సెల్‌కంపెనీలు సిమ్‌లతో నెట్‌వర్క్‌లపై ఆరా? కర్నూల్‌కు ఫోన్లు వెళ్లినట్లు గుర్తింపు..పలువురి అరెస్ట్ ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి, సోదరుడు ముష్కర ముఠా కోసం పోలీసుల విస్తృత గాలింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉగ్రవాద కోణంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన జానకీపురం ఎన్కౌంటర్ జరిగిన మూడో రోజు కూడా ముష్కరుల కోసం గాలింపు కొనసాగింది. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, మన పోలీసులు అర్వపల్లి గుట్టలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులెవరైనా ఇక్కడ ఉన్నారా.. లేదంటే ఎన్కౌంటర్లో హతమైన వారికి సం బంధించిన వివరాలు ఏమైనా లభిస్తాయా అనే కోణంలో ఈ కూంబింగ్ సాగుతోంది. కూంబింగ్‌లో 200 మందికిపైగా పోలీసులు, ఆరు బృందాలుగా విడిపోయి పాల్గొంటున్నట్టు సమాచారం. అర్వపల్లి గుట్ట,పెద్దగుట్ట, కంచగట్టుతోపాటు పలు గ్రామాల్లో కూడా ఈ కూంబింగ్ జరిగింది. అయితే, ఆదివారం జరిగిన కూంబింగ్‌లో ఎన్కౌంటర్ మృతులకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికినట్టు తెలుస్తున్నా.. సోమవారం కూంబింగ్‌లో ఎలాంటి ఆధారాలూ లభించలేదని సమాచారం. మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా తమ విచారణను వేగవంతం చేశాయి. ముంబైకి చెందిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు రెండోరోజు కూడా ఆధారాల సేకరణలో ఉన్నారు. అసలు తొలి ఘటన జరిగిన సూర్యాపేట బస్టాండ్‌కు సోమవారం వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అంతకంటే ముందు ఎన్కౌంటర్ ఘటన జరిగిన మోత్కూరు మండలం జానకీపురానికి తమిళనాడుకు చెందిన పోలీసులు వెళ్లారు. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. స్థానికులను, పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. దర్గా వద్దకు ఏటీఎస్.. అదే విధంగా ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదులు ఘటనకు ముందురోజు బస చేశారని భావిస్తున్న అర్వపల్లి దర్గాకు ముంబై ఏటీఎస్ పోలీసులు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఏటీఎస్ బృందం అసలు ఆ ప్రాంతంలో ఎన్ని కంపెనీల సెల్ఫోన్లు పనిచేస్తున్నాయనేది చెక్ చేసుకున్నారు. పది కంపెనీల సిమ్‌కార్డులు తీసుకెళ్లి ఫోన్లలో వేసి నెట్‌వర్క్‌లను ఆరా తీశారు. దర్గానుంచి కర్నూల్లోని కొందరికి ఫోన్లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారంతో కర్నూల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి, ఉగ్రవాదులకు సంబంధం లేదని, ఓ దొంగలముఠా వారిగా గుర్తించారు. అదే విధంగా దర్గాతో పాటు జిల్లాలోని కొన్ని మదర్సాలను కూడా దర్యాప్తు బృందాలు విచారిస్తున్నట్టు సమాచారం. దుండగులు మదర్సాలలో ఏమైనా షెల్టర్ తీసుకున్నారా.. తాము ఉగ్రవాదులమని చెప్పకుండా సాధారణ పౌరుల్లా మదర్సాలను ఆశ్రయించారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఎజాజ్‌ను తీసుకెళ్లారు.. కాగా, ఎన్కౌంటర్లో చనిపోయిన ఎజాజుద్దీన్ మృతదేహాన్ని ఆయన తండ్రి, సోదరుడు వచ్చి తీసుకెళ్లారు. ఘటన వివరాలు తెలుసుకున్న వారు మృతి చెందింది తమ కుమారుడేనని తెలుసుకుని నల్లగొండకు చేరుకున్నారు. ఎజాజ్ తండ్రిని నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఎడమచేతికి ఒక వేలు లేదని, గతంలో వరికోత యంత్రంలో పడి వేలు తెగిపోయిందని ఆయన చెప్పారు. ఎజాజ్ తండ్రి నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కామినేని ఆసుపత్రి నుంచి వారి స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో మధ్యాహ్నం సమయంలో వారు మృతదేహంతో మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు. ప్రజల్లో ఆందోళన.. ముష్కరులు ఇద్దరే కాదని, ఇంకా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు. సూర్యాపేట బస్టాండ్ ఘటన తర్వాత రెండు రోజులకు ఇద్దరు దుండగులు బయటకు వచ్చిన నేపథ్యంలో, ఇంకెవరైనా ఎక్కడయినా దాక్కున్నారా... బయటకు వస్తారా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసుబలగాలు పెద్ద ఎత్తున కనిపిస్తుండడంతో మళ్లీ కాల్పులు ఏమైనా జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది. ఇంకా దుండగులు ఉన్నారని, అయితే వారు జిల్లాలోనే ఉన్నారా లేక రాష్ట్రం దాటి వెళ్లిపోయారా అనే విషయంలో పోలీసుల నుంచి స్పష్టత వస్తేనే ఈ ఆందోళన తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడో వ్యక్తి వచ్చివెళ్లినట్లు నిర్ధారణ ఎజాజుద్దీన్, అస్లాంతోపాటు మూడో వ్యక్తి కూడా అర్వపల్లి దర్గాకు వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అతను వీరికి డబ్బులు ఇచ్చినట్లు భావిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడు..ఎలా వెళ్లాడనే కోణంపై దృష్టిసారించారు. కాగా, అర్వపల్లి దర్గానుంచి ఉగ్రవాదులు ఎవరెవరికి ఫోన్‌చేశారో సంబంధింత కాల్‌డేటాను హైదరాబాద్‌కు పంపించారు. -
మూడో రోజూ సాగిన కూంబింగ్
అర్వపల్లి: మండల కేంద్రంలోని స్థానిక దర్గా వద్ద ఉన్న పెద్ద గుట్ట ప్రాంతంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్పెషల్ పార్టీతో పాటు పోలీసులు సోమవారం మూడో రోజు కూడా కూంబింగ్ నిర్వహించారు. శనివారం మండల పరిధిలోని సీతారాంపురం వద్ద కాల్పులు జరిపిన అనంతరం తిరిగి అర్వపల్లిలో ఓబైక్తో పరారై మోత్కూర్ మండలం జానకీపుం వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు అస్లాం, ఎజాజుద్దీన్‌గా కేంద్ర భద్రత దళాలు గుర్తించిన విషయం తెలిసింది. ఈనెల 2న సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదులు రెండు రోజుల అనంతరం అర్వపల్లిలోనే ప్రత్యక్షం కావడం అందరినీ అశ్చర్యానికి గురిచేసిన విషయం విదితమే. ఆ రెండు రోజులు ఎక్కడున్నారు. వీరికి దర్గా వద్ద ఆశ్రయం ఎరైనా కల్పించారా లేదా కొత్త వ్యక్తులు అవటంచేత దర్గా వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుస్తున్న వార్తల్లో నిజమెంత అనే సందేహం వ్యక్తం అవుతోంది. సూర్యాపేట బస్టాండ్‌లో వారితో పాటు మరో వ్యక్తిబ్యాగుతో సంచరిస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో కన్పించిన మూడవ వ్యక్తి వారితో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న కీలక సమచారాన్ని ఆమూడో వ్యక్తి ఎక్కడికైనా తీసుకెళ్లాడా అనే అనుమానంతోనే జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి అణువణువునా సోదాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ఐడి పార్టీ చీఫ్, స్పెష్టల్ పార్టీ పోలీసులు సోమవారం దర్గా ప్రాంతాలోకి వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. అణువణువూ జల్లెడ తిరుమలగిరి : జానకీపురం ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు ఈప్రాంతంలోనే తీరిగారని దాంతో పాటు మరో ఉగ్రవాది ఈప్రాంతంలోనే ఉన్నారనే సమాచారంతో నియోజకవర్గంలో సోమవారం గ్రేంహౌడ్స్, స్పేషల్ పార్టీతోపాటు సివిల్ పోలీసులు అణువణువూ సోదాలు నిర్వహించారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన ఎజాజుద్దీన్, అస్లాం అర్వపల్లి దర్గాలో తలదాచుకున్నారని, దుండగులకు సంబంధించిన కొత్త సమాచారం ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తుల కూంబింగ్ నిర్వహించారు. అర్వపల్లి దర్గా పెద్ద గుట్ట, కంచగట్టు గుట్టలలో పోలీసులు జల్లెడ పట్టారు. ముష్కరులు బైక్‌పై వెళ్లిన కొత్తపల్లి, నాగారం, ఫణిగిరి, ఈటూరు, అనంతారం, మూసీ పరీవాహక ప్రాంతమైన చిర్రగూడూరు, జానకీపురం గ్రామాల్లో మృతుల బ్యాగులు, సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఆనవాల్లు దొరక్కుతాయనే కోణంలో గాలింపులు చేశారు. భయాందోళనలో ప్రజలు జానకీపురంలో చనిపోయిన అస్లాంఆయూబ్, మహ్మద్ ఎజాజుద్దీన్‌లు సిమి ఉగ్రవాద సంస్థకు చెందినవారని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరితో పాటు వచ్చిన మరో వ్యక్తి ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడనే పుకార్లు వస్తుండడం.. రాత్రి పగలు అనకుండా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఎన్కౌంటర్ జరిగి 48గంటలు కావస్తున్నా ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు. ఎన్కౌంటర్ స్థలం పరిశీలన మోత్కూరు: మండలంలోని జానకీపురం గ్రామంలో ఎన్కౌంటర్ జరిగిన స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన డాగ్, బాంబ్‌స్క్వాడ్ బృందాలతో పాటు తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం సోమవారం ఉదయం పరిశీలించింది. డాగ్, బాంబ్స్క్వాడ్బృందాలు ఎన్కౌంటర్ జరిగిన స్థలం, ఉగ్రవాదులు సంచరించిన బిక్కేరు ప్రాంతాన్ని అణువణువూ శోధించారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఏమైన ఆచూకి లభిస్తుందో ఏమోనని వారు సమగ్రంగా పరిశీలన చేశారు. ఎన్కౌంటర్ జరిగిన తీరుతెన్నులను, ఉగ్రవాదులు తిరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎస్ఐ పురేందర్‌భట్ వారికి వివరించి చూపించారు. తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం,సీఐడీ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను కెమెరాలు, సెల్ఫోన్లలో తీసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఘటన స్థలాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల పోలీసులు పరిశోధన బృందాలు సందర్శించనున్నట్లు తెలిసింది. -
మిస్‌ఫైర్
నార్నూర్/జైనూర్ : స్పెషల్ పార్టీ పోలీసు గన్ మిస్‌ఫైర్ అయింది. ఆ బుల్లెట్ ఖాళీ కోక్ సమీపంలో పండ్లు కొంటున్న గిరిజనుడికి తగలడంతో అతడికి గాయాలయ్యాయి. బాధితుడిని పట్టించుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వాహనంలో బయల్దేరడంపై గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ఆగ్రహించారు. వాహనాన్ని అడ్డుకొని సిబ్బందిని నిలదీశారు. ఠాణా ముట్టడించి ఐదుగంటలపాటు ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్-యు మండలం లింగాపూర్ అటవీ ప్రాంతంలో కరీంనగర్ స్పెషల్ పార్టీ పోలీసులు సోమవారం కూంబింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం జైనూర్ మండల కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్ ప్రాంతంలోని స్వీట్‌హౌస్ షెడ్డు కింద కూర్చుని నీళ్లు తాగుతుండగా స్పెషల్ పార్టీకి చెందిన కరుణాకర్ నిర్లక్ష్యంతో అతడి తుపాకి మిస్‌ఫైర్ అయింది. పక్కనే పండ్లు కొంటున్న జైనూర్‌కు చెందిన కనక అరుణ్ వెంకటేశ్‌కు బుల్లెట్ ఖాళీ కోక్ తగిలి తలకు గాయమైంది. గన్ పేలిన శబ్దానికి స్థానికులు తలోదిక్కుకు భయంతో పరుగులు తీశారు. అయితే గాయపడిన యువకుడిని పట్టించుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులు ఆర్టీసీ బస్సు ఎక్కి ఆసిఫాబాద్ బయల్దేరారు. వీరి తీరుపై ఆగ్రహించిన గిరిజన సంఘాల నాయకులు మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో వారి బస్సును అడ్డుకున్నారు. వారిని నిలదీశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. యువకుడి సంరక్షణకు తాము అన్ని చర్యలు తీసుకుంటామని సీఐ రఘు హామీ ఇచ్చారు. వినిపించుకోని గిరిజనులు బస్సును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం వారు ఠాణాను ముట్టడించారు. సుమారు ఐదుగంటల పాటు స్టేషన్ ఎదుట బైఠాయించారు. సీఐ సూచనల మేరకు గిరిజనులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిబ్బందిపై కేసునమోదు చేశారు. వెంకటేశ్ చికిత్స నిమిత్తం రూ.5 వేలు అందించారు. చికిత్సకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన విరమించారు. సీఐ వెంట కూబింగ్ పార్టీ ఎస్సై స్వామి ఉన్నారు. -
నగరంపై నిఘా
నెల్లూరు(క్రైమ్): ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్.సెంథిల్ కుమార్ నెల్లూరు నగరంలో శాంతిభధ్రతలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవల కాలంలో నేరాల శాతం పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రించేందుకు తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. వీఆర్‌లో ఉన్న సీఐలు, ఎస్సైలతో ఇటీవల సమావేశం నిర్వహించిన ఆయన నేరనియంత్రణపై వారితో చర్చించి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా నగరంలోని ప్రతి పోలీసుస్టేషన్‌కు ముగ్గురు ఎస్సైలు, ఐదుగురు స్పెషల్ పార్టీ సిబ్బందిని కేటాయించారు. వీరిపై పర్యవేక్షణ బాధ్యతలను వీఆర్‌లో ఉన్న సీఐలకు అప్పగించారు. ఎస్సైల్లో ఒకరు రాత్రి పూట గస్తీ నిర్వహించాలి. మరొకరు వాహనాలు తనిఖీలు చేపట్టాలి. ఇంకొకరు స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. ఇప్పటికే తమకు కేటాయించిన స్టేషన్లలో ఎస్సైలు, సిబ్బంది చర్యలను వేగవంతం చేశారు. రాత్రి పూట గస్తీ తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలిస్తున్నారు. విచారించిన తర్వాత సొంతపూచీకత్తుపై విడుదల చేస్తున్నారు. అవసరమైతే బైండోవర్ చేసుకుంటున్నారు. ఆకతాయిలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రికార్డులు సరిగా లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాలతో పాటు నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలపై దృష్టిపెట్టారు. మద్యం దుకాణాలు, జాతీయరహదారి వెంబడి ఉన్న దాబాలను రాత్రి 10.30 గంటల లోపే మూయించివేస్తున్నారు. ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండుల్లోని దుకాణాలను సైతం మూసివేసేలా చర్యలు చేపట్టారు. -
మట్కా ‘డాన్’లను అరెస్టు చేయండి
కర్నూలు, న్యూస్‌లైన్: పేద ప్రజల జీవితాలను బుగ్గి పాలు చేస్తున్న మట్కాను నడుపుతున్న డాన్లను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డితో కలిసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మట్కాను పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో మట్కాను పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని మట్కా డాన్లను వారం లోగా అరెస్ట్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాని పక్షంలో స్పెషల్ పార్టీ పోలీసుల చేత అరెస్ట్ చేయించి సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ఈ ఆపరేషన్ జిల్లా మొత్తానికి వర్తింపజేస్తామన్నారు. జిల్లా అంతటా మట్కాను అరికట్టేందుకు సంబంధిత పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటే కేసు నమోదు, చార్జిషీట్ ఫైల్ చేసే సమయంలో సీఐలు, ఎస్ఐలు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. వాటిలో లోపాలుంటే కేసులు వీగిపోయే ప్రమాదం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దాడులకు సంబంధించిన కేసుల్లో గాయాలకు సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్లను పొందు పరిచే సమయంలో సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ద్వారా జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేసే అంశం చర్చకు రాగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలు, ఫిర్యాది దారుల సమాచారాన్ని రికార్డింగ్ చేయడం ద్వారా అనవసర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. మహిళా ఫిర్యాదిదారులు వచ్చిన సందర్భంలో మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా హోంగార్డులు లేదా ఇతర మహిళల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించడం, విచారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డీఎస్పీలు వైవి.రమణకుమార్, అమర్నాథ్ నాయుడు, శివరామిరెడ్డి, బీఆర్.శ్రీనివాసులు, రామాంజనేయులు రెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు సమావేశంలో పాల్గొన్నారు.