ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు | 2 SIMI activists arrested for links to Janakipuram Encounter | Sakshi
Sakshi News home page

ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు

Published Tue, Apr 7 2015 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM

ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు - Sakshi

ముష్కరుల కోసం పోలీసుల విస్తృత గాలింపు

 తుంగతుర్తి నియోజకవర్గంలో గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ దళాలు
 ఘటనాస్థలికి వెళ్లిన తమిళనాడు పోలీసులు
 సూర్యాపేట బస్టాండ్‌లో ముంబై ఏటీఎస్ స్క్వాడ్ తనిఖీలు
 దర్గా దగ్గరకు కూడా..!
 పది సెల్‌కంపెనీలు సిమ్‌లతో నెట్‌వర్క్‌లపై ఆరా?
 కర్నూల్‌కు ఫోన్లు వెళ్లినట్లు గుర్తింపు..పలువురి అరెస్ట్
 ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి, సోదరుడు

 
 ముష్కర ముఠా కోసం పోలీసుల విస్తృత గాలింపు
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ :  ఉగ్రవాద కోణంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన జానకీపురం ఎన్‌కౌంటర్ జరిగిన మూడో రోజు కూడా ముష్కరుల కోసం గాలింపు కొనసాగింది. గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, మన పోలీసులు అర్వపల్లి గుట్టలు, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులెవరైనా ఇక్కడ ఉన్నారా.. లేదంటే ఎన్‌కౌంటర్‌లో హతమైన వారికి సం బంధించిన వివరాలు ఏమైనా లభిస్తాయా అనే కోణంలో ఈ కూంబింగ్ సాగుతోంది. కూంబింగ్‌లో 200 మందికిపైగా పోలీసులు, ఆరు బృందాలుగా విడిపోయి పాల్గొంటున్నట్టు సమాచారం. అర్వపల్లి గుట్ట,పెద్దగుట్ట, కంచగట్టుతోపాటు పలు గ్రామాల్లో కూడా ఈ కూంబింగ్ జరిగింది.
 
 అయితే, ఆదివారం జరిగిన కూంబింగ్‌లో ఎన్‌కౌంటర్ మృతులకు సంబంధించిన ఒక బ్యాగ్ దొరికినట్టు తెలుస్తున్నా.. సోమవారం కూంబింగ్‌లో ఎలాంటి ఆధారాలూ లభించలేదని సమాచారం. మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా తమ విచారణను వేగవంతం చేశాయి. ముంబైకి చెందిన యాంటీ టైస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు రెండోరోజు కూడా ఆధారాల సేకరణలో ఉన్నారు. అసలు తొలి ఘటన జరిగిన సూర్యాపేట బస్టాండ్‌కు సోమవారం వెళ్లారు. అక్కడ ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అంతకంటే ముందు ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన మోత్కూరు మండలం జానకీపురానికి తమిళనాడుకు చెందిన పోలీసులు వెళ్లారు. అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. స్థానికులను, పోలీసులను అడిగి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
 
 దర్గా వద్దకు ఏటీఎస్..
 అదే విధంగా ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులు ఘటనకు ముందురోజు బస చేశారని భావిస్తున్న అర్వపల్లి దర్గాకు ముంబై ఏటీఎస్ పోలీసులు వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఏటీఎస్ బృందం అసలు ఆ ప్రాంతంలో ఎన్ని కంపెనీల సెల్‌ఫోన్‌లు పనిచేస్తున్నాయనేది చెక్ చేసుకున్నారు. పది కంపెనీల సిమ్‌కార్డులు తీసుకెళ్లి ఫోన్లలో వేసి నెట్‌వర్క్‌లను ఆరా తీశారు. దర్గానుంచి కర్నూల్‌లోని కొందరికి ఫోన్లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారంతో కర్నూల్‌లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి, ఉగ్రవాదులకు సంబంధం లేదని, ఓ దొంగలముఠా వారిగా గుర్తించారు. అదే విధంగా దర్గాతో పాటు జిల్లాలోని కొన్ని మదర్సాలను కూడా దర్యాప్తు బృందాలు విచారిస్తున్నట్టు సమాచారం. దుండగులు మదర్సాలలో ఏమైనా షెల్టర్ తీసుకున్నారా.. తాము ఉగ్రవాదులమని చెప్పకుండా సాధారణ పౌరుల్లా మదర్సాలను ఆశ్రయించారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది.
 
 ఎజాజ్‌ను తీసుకెళ్లారు..
 కాగా, ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఎజాజుద్దీన్ మృతదేహాన్ని ఆయన తండ్రి, సోదరుడు వచ్చి తీసుకెళ్లారు. ఘటన వివరాలు తెలుసుకున్న వారు మృతి చెందింది తమ కుమారుడేనని తెలుసుకుని నల్లగొండకు చేరుకున్నారు. ఎజాజ్ తండ్రిని నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఎడమచేతికి ఒక వేలు లేదని, గతంలో వరికోత యంత్రంలో పడి వేలు తెగిపోయిందని ఆయన చెప్పారు. ఎజాజ్ తండ్రి నుంచి అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కామినేని ఆసుపత్రి నుంచి వారి స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఎజాజ్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో మధ్యాహ్నం సమయంలో వారు మృతదేహంతో మధ్యప్రదేశ్‌కు బయలుదేరారు.
 
 ప్రజల్లో ఆందోళన..
 ముష్కరులు ఇద్దరే కాదని, ఇంకా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు. సూర్యాపేట బస్టాండ్ ఘటన తర్వాత రెండు రోజులకు ఇద్దరు దుండగులు బయటకు వచ్చిన నేపథ్యంలో, ఇంకెవరైనా ఎక్కడయినా దాక్కున్నారా... బయటకు వస్తారా అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీసుబలగాలు పెద్ద ఎత్తున కనిపిస్తుండడంతో మళ్లీ కాల్పులు ఏమైనా జరుగుతాయా అనే చర్చ జరుగుతోంది. ఇంకా దుండగులు ఉన్నారని, అయితే వారు జిల్లాలోనే ఉన్నారా లేక రాష్ట్రం దాటి వెళ్లిపోయారా అనే విషయంలో పోలీసుల నుంచి స్పష్టత వస్తేనే ఈ ఆందోళన తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
 
 మూడో వ్యక్తి వచ్చివెళ్లినట్లు నిర్ధారణ
 ఎజాజుద్దీన్, అస్లాంతోపాటు మూడో వ్యక్తి కూడా అర్వపల్లి దర్గాకు వచ్చినట్లు పోలీసులు  నిర్ధారించారు. అయితే అతను వీరికి డబ్బులు ఇచ్చినట్లు భావిస్తున్నారు. అతను ఎక్కడికి వెళ్లాడు..ఎలా వెళ్లాడనే కోణంపై దృష్టిసారించారు. కాగా, అర్వపల్లి దర్గానుంచి ఉగ్రవాదులు ఎవరెవరికి ఫోన్‌చేశారో సంబంధింత కాల్‌డేటాను హైదరాబాద్‌కు పంపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement