మూడో రోజూ సాగిన కూంబింగ్ | Third day stretch kumbing | Sakshi
Sakshi News home page

మూడో రోజూ సాగిన కూంబింగ్

Published Tue, Apr 7 2015 3:18 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

మూడో రోజూ సాగిన కూంబింగ్ - Sakshi

మూడో రోజూ సాగిన కూంబింగ్

అర్వపల్లి:    మండల కేంద్రంలోని స్థానిక దర్గా వద్ద ఉన్న పెద్ద గుట్ట ప్రాంతంతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో స్పెషల్ పార్టీతో పాటు పోలీసులు సోమవారం మూడో రోజు కూడా కూంబింగ్ నిర్వహించారు. శనివారం మండల పరిధిలోని సీతారాంపురం వద్ద కాల్పులు జరిపిన అనంతరం తిరిగి అర్వపల్లిలో ఓబైక్‌తో పరారై మోత్కూర్ మండలం జానకీపుం వద్ద పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు అస్లాం, ఎజాజుద్దీన్‌గా కేంద్ర భద్రత దళాలు గుర్తించిన విషయం తెలిసింది.  ఈనెల 2న సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న ఉగ్రవాదులు రెండు రోజుల అనంతరం అర్వపల్లిలోనే ప్రత్యక్షం కావడం అందరినీ అశ్చర్యానికి గురిచేసిన విషయం విదితమే. ఆ రెండు రోజులు ఎక్కడున్నారు.
 
 వీరికి దర్గా వద్ద ఆశ్రయం ఎరైనా కల్పించారా లేదా కొత్త వ్యక్తులు అవటంచేత దర్గా వద్ద ఆశ్రయం పొందినట్లు తెలుస్తున్న వార్తల్లో నిజమెంత అనే సందేహం వ్యక్తం అవుతోంది. సూర్యాపేట బస్టాండ్‌లో వారితో పాటు మరో వ్యక్తిబ్యాగుతో సంచరిస్తున్నట్లు  సీసీ టీవీ ఫుటేజీల్లో కన్పించిన మూడవ వ్యక్తి వారితో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద ఉన్న కీలక సమచారాన్ని ఆమూడో వ్యక్తి ఎక్కడికైనా తీసుకెళ్లాడా అనే అనుమానంతోనే జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి అణువణువునా సోదాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ఐడి పార్టీ చీఫ్, స్పెష్టల్ పార్టీ పోలీసులు సోమవారం దర్గా ప్రాంతాలోకి వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు.  
 
 అణువణువూ జల్లెడ
 తిరుమలగిరి : జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులు ఈప్రాంతంలోనే తీరిగారని దాంతో పాటు మరో ఉగ్రవాది ఈప్రాంతంలోనే ఉన్నారనే సమాచారంతో నియోజకవర్గంలో సోమవారం గ్రేంహౌడ్స్, స్పేషల్ పార్టీతోపాటు సివిల్ పోలీసులు అణువణువూ సోదాలు నిర్వహించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఎజాజుద్దీన్, అస్లాం అర్వపల్లి దర్గాలో తలదాచుకున్నారని, దుండగులకు సంబంధించిన కొత్త సమాచారం ఏమైనా దొరుకుతుందనే ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తుల కూంబింగ్ నిర్వహించారు. అర్వపల్లి దర్గా పెద్ద గుట్ట, కంచగట్టు గుట్టలలో పోలీసులు జల్లెడ పట్టారు. ముష్కరులు బైక్‌పై వెళ్లిన కొత్తపల్లి, నాగారం, ఫణిగిరి, ఈటూరు, అనంతారం, మూసీ పరీవాహక ప్రాంతమైన చిర్రగూడూరు, జానకీపురం గ్రామాల్లో మృతుల బ్యాగులు, సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఆనవాల్లు దొరక్కుతాయనే కోణంలో గాలింపులు చేశారు.  
 
 భయాందోళనలో ప్రజలు
 జానకీపురంలో చనిపోయిన అస్లాంఆయూబ్, మహ్మద్ ఎజాజుద్దీన్‌లు సిమి ఉగ్రవాద సంస్థకు చెందినవారని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఇద్దరితో పాటు వచ్చిన మరో వ్యక్తి ఇక్కడే ఎక్కడో తలదాచుకున్నాడనే పుకార్లు వస్తుండడం.. రాత్రి పగలు అనకుండా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఎన్‌కౌంటర్ జరిగి 48గంటలు కావస్తున్నా ప్రజల్లో భయాందోళనలు తగ్గడం లేదు.
 
 ఎన్‌కౌంటర్ స్థలం పరిశీలన
 మోత్కూరు: మండలంలోని జానకీపురం గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని హైదరాబాద్‌కు చెందిన డాగ్, బాంబ్‌స్క్వాడ్ బృందాలతో పాటు తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం సోమవారం ఉదయం పరిశీలించింది. డాగ్, బాంబ్‌స్క్వాడ్‌బృందాలు  ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం, ఉగ్రవాదులు సంచరించిన బిక్కేరు ప్రాంతాన్ని అణువణువూ శోధించారు. ఉగ్రవాదులకు సంబంధించిన ఏమైన ఆచూకి లభిస్తుందో ఏమోనని వారు సమగ్రంగా పరిశీలన చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుతెన్నులను, ఉగ్రవాదులు తిరిగిన ప్రాంతాన్ని స్థానిక ఎస్‌ఐ పురేందర్‌భట్ వారికి వివరించి చూపించారు.  తమిళనాడుకు చెందిన పోలీసుల బృందం,సీఐడీ పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను కెమెరాలు, సెల్‌ఫోన్లలో తీసుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరో నాలుగైదు రోజులపాటు ఘటన స్థలాన్ని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల పోలీసులు పరిశోధన బృందాలు సందర్శించనున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement