వీరేషా... అతనెవరు?
ప్రశ్నిస్తున్న హరినగర్ వాసులు
సోదాలు చేసిన నగర పోలీసులు
సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధి నుంచి పదో తరగతి విద్యార్థి అభయ్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన కేసులో ముషీరాబాద్ పరిధిలోని హరినగర్ తెరపైకి వచ్చింది. ఈ ఉదంతంలో కిడ్నాపర్లు అభయ్ తండ్రి రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి ‘7842276480’ ఫోన్ నెంబర్ వాడారు. టాటా డొకోమోకు చెందిన ఈ నెంబర్ ‘బి.వీరేష్, 1-7-1022/8/9/బీ, హరినగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్‌నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టర్ అయి ఉంది. దీంతో ‘సాక్షి’ ఆ ఇంటికి వెళ్లి వీరేష్ కోసం ఆరా తీసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి యజమానితో పాటు చుట్టుపక్కల వాళ్లు సైతం అలాంటి పేరు గల వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరని, గతంలోనూ నివసించలేదని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి నగర పోలీసులు సైతం వచ్చి సోదాలు చేసి వెళ్లారని వివరించారు. దీంతో కిడ్నాపరుల తప్పుడు వివరాలతో సిమ్‌కార్డు తీసుకుని ఉంటారని పోలీసులు చెప్తున్నారు.
సిమ్‌కార్డ్ ఔట్‌లెట్స్‌పై దాడులు...
అభయ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఈ కుట్రను అమలు చేయడానికి బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించినట్లు తేలింది. ఇలాంటి సిమ్‌కార్డుల్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్న దుకాణాలతో పాటు నిందితులు సిమ్స్ ఖరీదు చేసిన దుకాణాన్నీ పోలీసుల గుర్తించారు. దీంతో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి సికింద్రాబాద్‌లోని కొన్ని దుకాణాలపై దాడులు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో దుండగులకు సిమ్‌కార్డులు అమ్మిన వారు ఎవరనేది ఆరా తీస్తున్నారు.