- పోలీసుల విచారణలో వెలుగుజూసిన వైనం
నాయుడుపేటటౌన్: ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై కలకలం సృష్టించిన కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌నకు గురైన వ్యక్తితో పాటు చేసిన వారు కూడా ఎర్రచందనం స్మగ్లర్లేనని పోలీసులు తేల్చారు. పోలీసుల విచారణలో ఎర్రచందన స్మగ్లర్ల మధ్య నెలకొన్న వివాదమే కిడ్నాప్‌నకు కారణంగా వెల్లడైంది. చిత్తూరు జిల్లా పుత్తూరు గ్రామానికి చెందిన అరవ బాలసుబ్రమణ్యం గతంలో ఎర్రచందనం స్మగర్లతో కలిసి అక్రమ రవాణా చేసేవాడని పోలీసులు తెలుసుకున్నారు. బాలసుబ్రమణ్యం పెలైట్‌గాను, ఎర్రచందనం వాహనాల డ్రైవర్‌గాను వెళుతుండేవాడు. ఈ క్రమంలో తమిళనాడు ప్రాంతానికి చెందిన కొందరు ఎర్రచందనం స్మగర్లతో అక్రమ రవాణా చేస్తూ ఒక వాహనంతో పాటు ఎర్రచందననాన్ని స్మగ్లర్లకు తెలియకుండా గతంలో విక్రయించాడని తెలిపారు.
ఈ విషయమై స్మగ్లర్లు కక్ష కట్టి చాకచక్యంగా ఆదివారం చిత్తూరు జిల్లా పరిధిలోని పుత్తూరులో బాలసుబ్రమణ్యంను కిడ్నాప్ చేసి ఎర్రచందనంకు సంబంధించి మోసం చేసిన నగదును రాబట్టేందుకు ప్రయత్నించారు. చివరకు బాలసుబ్రమణ్యం తండ్రి శర కరయ్యకు ఫోన్‌చేసి రూ.5లక్షలు ఇస్తే వదిలి పెడతామంటూ బెదిరించారు. డబ్బులు తెచ్చివ్వకపోవడంతో బాలసుబ్రమణ్యంను హత్య చేసేందుకు పన్నాగం పన్ని కత్తులు సైతం తీసుకుని నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపైకి ఆదివారం రాత్రి చేరుకున్నారు. విన్నమాల వద్ద కారును నిలిపి మద్యం తెచ్చుకునేందుకు ఒకరు వెళ్లాగా కారులో నుంచి బాలసుబ్రమణ్యం తప్పించుకుని వెళుతుండగా మిగిలిని ఇద్దరు స్మగ్లర్లు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.
అక్కడి నుంచి బయటపడిన బాలసుబ్రమణ్యం పోలీసులకు ఇవేమీ చెప్పకుండా తనను గుర్తుతెలియని తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి బారి నుంచి తప్పించుకొని వచ్చానని పోలీసులను తప్పుదోవ పట్టించాడు. విన్నమాల గ్రామస్తులు జాతీయ రహదారిపై అనుమానంగా తిరుగుతున్న ముగ్గురుని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పరారు కాగా ఒకరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికిన వ్యక్తి బాలసుబ్రమణ్యంను కిడ్నాప్ చేసిన స్మగ్లర్లలో ఒకరైన కార్తీక్‌గా గుర్తించారు. మరో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లు మణి, తిరుమలైతో పాటు కారు డ్రైవర్ పరారయ్యారని చెప్పారు.
ఎర్రచందనం కేసులో సుబ్రమణ్యంను అరెస్టు చేసి ఉన్న తమిళనాడు పోలీసులు
తమిళనాడు పరిధిలోని పల్లిపట్టు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అక్కడి పోలీ సులు గతంలో సుబ్రహ్మణ్యంను అరెస్టు చేసి ఉన్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఎర్రచందనం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అక్రమ వ్యాపారానికి దూరంగా ఉన్నట్లు బాలసుబ్రమణ్యం కుటుంబసభ్యులు సోమవారం నాయుడుపేట పోలీసులకు తెలిపారు. తమిళనాడుకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు వారి వివరాలు ఎక్కడ తెలుపుతాడోనని అతడిని హతమార్చేం దుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అనుమానం వ్యక్తం చేశారు.
గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రత్తయ్య, ఎస్సై ఆంజనేయరెడ్డి ఎర్రదొంగల పూర్తి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. పుత్తూరు ఎస్సైతో పాటు అక్కడి పోలీసులు నాయుడుపేటకు చేరుకుని ఇక్కడి పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ కార్తీక్‌తో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే కత్తిపోట్లకు గురై ఉన్న అరవ బాలసుబ్రమణ్యంను విచారించారు. ఈ కేసును పుత్తూరుకు బదిలీ చేయించుకుని విచారించేందుకు అక్కడి పోలీసులు సిద్ధమవుతున్నారు.
అందరూ ఎర్రచందనం స్మగ్లర్లే
Published Tue, May 5 2015 4:24 AM | Last Updated on Mon, Oct 22 2018 1:59 PM
Advertisement
Advertisement