కర్నూలు, న్యూస్‌లైన్: పేద ప్రజల జీవితాలను బుగ్గి పాలు చేస్తున్న మట్కాను నడుపుతున్న డాన్‌లను వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కేఎస్ వ్యాస్ ఆడిటోరియంలో అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డితో కలిసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మట్కాను పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో మట్కాను పూర్తిగా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా కేంద్రంలోని మట్కా డాన్‌లను వారం లోగా అరెస్ట్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాని పక్షంలో స్పెషల్ పార్టీ పోలీసుల చేత అరెస్ట్ చేయించి సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమయ్యే ఈ ఆపరేషన్ జిల్లా మొత్తానికి వర్తింపజేస్తామన్నారు. జిల్లా అంతటా మట్కాను అరికట్టేందుకు సంబంధిత పోలీస్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల్లో నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడాలంటే కేసు నమోదు, చార్జిషీట్ ఫైల్ చేసే సమయంలో సీఐలు, ఎస్‌ఐలు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవాలన్నారు. వాటిలో లోపాలుంటే కేసులు వీగిపోయే ప్రమాదం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దాడులకు సంబంధించిన కేసుల్లో గాయాలకు సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్లను పొందు పరిచే సమయంలో సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ద్వారా జిల్లాలోని ప్రభుత్వ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం ఏర్పాటు చేసే అంశం చర్చకు రాగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎస్పీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే మహిళలు, ఫిర్యాది దారుల సమాచారాన్ని రికార్డింగ్ చేయడం ద్వారా అనవసర సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు.
మహిళా ఫిర్యాదిదారులు వచ్చిన సందర్భంలో మహిళా కానిస్టేబుళ్లు లేదా మహిళా హోంగార్డులు లేదా ఇతర మహిళల సమక్షంలో ఫిర్యాదులు స్వీకరించడం, విచారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, ఆళ్లగడ్డ డీఎస్పీలు వైవి.రమణకుమార్, అమర్‌నాథ్ నాయుడు, శివరామిరెడ్డి, బీఆర్.శ్రీనివాసులు, రామాంజనేయులు రెడ్డితో పాటు జిల్లాలోని సీఐలు సమావేశంలో పాల్గొన్నారు.
మట్కా ‘డాన్’లను అరెస్టు చేయండి
Published Sun, Jan 12 2014 4:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement