రామాయంపేట: బీసీల కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నదని, ఆ దిశగా ముందుకు వెళుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మెదక్ జిల్లా రామాయంపేట వద్ద రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏపార్టీ కూడా బీసీల సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
బీసీలకు ప్రజాస్వామ్య ఫలాలు దక్కడంలేదని, తమకు ప్రత్యేకంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా బీసీలలో 2,600 ఉప కులాలుండగా, ఇందులో 2,550 కులాలకు పార్లమెంటులో అసలు ప్రాతినిథ్యం దక్కలేదన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఎంతమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల్లో త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
జనాభా ప్రాతిపాదికన రాష్ట్రంలో బీసీకి చెందినవారు 60 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా, 19 మంది మాత్రమే ఉన్నారన్న ఆయన ఎనిమిదిమంది ఎంపీలకు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. 2019 వరకు తాము రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. ఈమేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో చలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.