సాక్షి, హైదరాబాద్: తబ్లిగీ జమాత్ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి వివరాల సేకరణ పోలీసులకు కష్టంగా మారుతోంది. ఎన్నార్సీ సర్వే జరుగుతోందన్న అపోహతో చిరునామాలు తీసుకునేందుకు వెళ్లిన ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చేందుకు కొందరు ససేమిరా అంటున్నారు. ఇది ముమ్మాటికీ ఎన్‌ఆర్‌సీ కోసమే అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెళ్లకపోతే దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. తమ ఆధార్ కార్డులు, ఇంటి నెంబర్లు మీకెందుకు అని సతాయిస్తున్నారు.
దీంతో ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు సమాచారమిస్తున్నారు. వారు రంగ ప్రవేశం చేసి ఒప్పించే సరికి తలప్రాణం తోకకు వస్తోందని వాపోతున్నారు. తెలంగాణ నుంచి 1,030 మంది ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమాలకు వెళ్లి వచ్చారని ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. ఇందులో ఇంకా 100 మందికి పైగా ఉన్నవారి ఆచూకీ ఇంకా తెలియలేదు. మరోవైపు శుక్రవారం ఒకేరోజు 75 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో పోలీసులు వారి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు..
మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారంతా నేరుగా రాష్ట్రానికి రాలేదు. అందుకే, పోలీసులకు అందరి వివరాలు తెలియడం లేదు. కొందరు సమూహాలుగా రైలు, రోడ్డు మార్గాల ద్వారా వచ్చారు. ఇలాంటి వారి ఆచూకీ సులభంగా కనిపెట్టగలుగుతున్న పోలీసులు.. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లినవారి వివరాలు కనుక్కోవడం గగనంగా మారిందంటున్నారు. ఇలాంటి వారిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. క్వారంటైన్‌కు వెళ్లకుండా విధులకు హాజరవుతుండటంతో సెక్రటేరియట్, సింగరేణిలో కరోనా ఇదే పద్థతిలో విస్తరించిన సంగతి తెలిసిందే.
తాజాగా నల్లగొండలో ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతని వద్ద పాఠాలు విన్న 60 మంది విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సమాచారాన్ని దాచిపెట్టిన వారిపై కేసులు పెడుతామని హెచ్చరించినా కొందరిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఒంటరిగా ఢిల్లీకి వెళ్లిన వారంతా.. లాక్‌డౌన్ విధించాక నేరుగా రాష్ట్రానికి రాలేదు. మధ్యలో పలు ప్రార్థనా మందిరాలను సందర్శించారు. ఫలితంగా ఆలస్యంగా రాష్ట్రానికి చేరుకుంటున్నారు. తెలంగాణలో ప్రతిరోజూ బయటపడుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అధికశాతం వీరే కావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది.
స్వచ్ఛందంగా ముందుకు రండి..
ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు అందించి సహకరించాలని పోలీసులు, అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారిని..వారి కుటుంబీకుల ప్రాణాలను ఆపదలోకి నెట్టవద్దని సూచిస్తున్నారు. ఇరుగుపొరుగు వారు సైతం ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి వివరాలు డయల్ 100కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు పలు చైతన్య కార్యక్రమాల ద్వారా వివరించే యత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment