సాక్షి, కరీంనగర్/మహబూబ్‌నగర్/నిజామాబాద్/ఖమ్మం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు, తెలంగాణ జనసమితి నేత కోదండరాం భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారంతో ఏడో రోజుకు చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్మికులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తమ సమ్మెకు మద్దతివ్వాలని.. వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో కార్మికులంతా భారీ ర్యాలీని నిర్వహించి ప్రభుత్వాసుపత్రి ఎదుట మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాన్వాయ్‌కి అడ్డుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లా భారతీయ మజ్ధూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఏసీ, జగిత్యాల డిపో కార్మికులతో పాటు పలు విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగి, కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఖమ్మంలోని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తమ పార్టీ కార్యాలయం నుంచి బస్ డిపో వరకు నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో ముందు ధర్నాకు దిగారు. కాగా కరీంనగర్ జిల్లా సమ్మెలో భాగంగా డిపో 1 ముందు మహిళా ఉద్యోగులు మోకాళ్లపై నిలుచుని నిరసన చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ కార్మికులంతా కలిసి కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు.
రాజకీయ నాయకుల సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ నగేష్, అక్కెనపల్లి కుమార్‌లు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా అర్మూర్‌లో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇక నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టిన కార్మికులకు వివిధ రాజకీయ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపారు. అలాగే మధిర డిపో ఎదుట నిరసన చేపట్టిన ఆర్టీసీ కార్మికులకు యుటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ర్యాలీగా వచ్చి సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment