పెద్దల రేసు | political leaders focus on local bodies elections | Sakshi
Sakshi News home page

పెద్దల రేసు

Published Fri, Jan 2 2015 1:12 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

political leaders focus on  local bodies elections

చలికాలంలోనూ జిల్లా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. త్వరలో ఖాళీ అయ్యే శాసనమండలి (స్థానిక సంస్థలు) స్థానం నుంచి బరిలో దిగడానికి కాకలు తీరిన రాజకీయయోధులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నం నరేందర్‌రెడ్డి పదవీకాలం మార్చితో ముగియనుంది.

దీంతో ఈ కుర్చీపై కన్నేసిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ‘పెద్దలు’ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి నరేందర్‌రెడ్డి, సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కదన కుతూహలం ప్రదర్శిస్తున్నారు.    

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  స్థానిక సమరంలో పట్టు నిలుపుకొన్న కాంగ్రెస్.. అధికారంతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ పార్టీలు మండలి పోరులో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. మండల, జిల్లా ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు లభించాయి. ఎమ్మెల్సీ పీఠాన్ని ఎగరేసుకుపోయేందుకు అవసరమైన స్థానాలు దక్కినప్పటికీ అనంతరం జరిగిన పరిణామాలతో ఆ పార్టీ డీలాపడింది. పలువురు ప్రజాప్రతినిధులు కారెక్కడంతో సంఖ్యాబలంలో తేడా వచ్చింది.

211 ఎంపీటీసీలు, 16 జెడ్పీటీసీలు గెలుచుకున్న ఆ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అధికస్థాయిలో కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ కేవలం 141 ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసీలు, ఒక మున్సిపాలిటీ మాత్రమే గెలుచుకున్నప్పటికీ, గద్దెనెక్కడమే తరువాయి ఆ పార్టీలోకి వలసల పర్వం కొన సాగింది. దీంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. మరోవైపు స్థానికంలో చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు గెలుచుకున్న టీడీపీకి 160 ఎంపీటీసీలు, 07 జెడ్పీటీసీలు, రెండు మున్సిపాలిటీల్లో పాగా వేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ‘దేశం’ మద్దతు కీలకంగా మారడంతో తాజా కౌన్సిల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
 
కదన కుతూహలం
సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ‘మండలి’ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించారు. దశాబ్దకాలం జిల్లా రాజకీయాలను శాసించిన సబితకు గ్రామీణంపై బలమైన పట్టుంది. స్థానిక సంస్థల్లో పార్టీకి మెజార్టీ ఉండడం, ఎమ్మెల్సీ స్థానం గెలుచుకునేందుకు సరిపడా సభ్యులుండడంతో ఆమె ‘పెద్దల’సభపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో పోటీచేయలేదనే సానుభూతి సానుకూలాంశంగా మారనుందనే వాదన వినిపిస్తోంది. ఎంపీటీసీల్లో సింహభాగం స్థానాలు తమవే కావడం, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ కంటే రెట్టింపు సంఖ్యలో కౌన్సిలర్లు ఉండడం ప్లస్ పాయింట్ కాగలదనే భావనలో ఉన్నారు.

అయితే తన అభ్యర్థిత్వంపై వైరివర్గం అనుసరించే వైఖరిపైనే సబిత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాగా, సమీప బంధువైన నరేందర్‌రెడ్డిపై పోటీచేసే అంశంలో చెల్లెమ్మ తీసుకునే నిర్ణయంపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ గురువైన మామ ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై పోటీ విషయంలో నరేందర్‌రెడ్డి వైఖరి ఎలాగుంటుందనేది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.
 
చెల్లెమ్మ కాదంటే..
ఒకవేళ సబిత పోటీకి నిరాకరిస్తే బరిలో దిగాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. ‘స్థానిక’ంలో పార్టీ బలీయంగా ఉండడం, ప్రత్యర్థి శిబిరాల్లోని రహస్యమిత్రులు సహకరిస్తారనే ధీమాతో ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ, బీజేపీల మద్దతుపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ పార్టీలను తమవైపు తిప్పుకోగలిగితే గెలుపు సులువని కేఎల్లార్ శిబిరం అంచనా వేస్తోంది. గులాబీ నాయకత్వంపై గుర్రు మీదున్న సీనియర్ నేత కొప్పుల హరీశ్వరరెడ్డి స్నేహ‘హస్తం’తో విజయానికి బాటలువేసుకోవాలని భావి స్తోంది.

జిల్లాలోనే అత్యధికంగా ఎంపీటీసీలను పరిగి సెగ్మెంట్‌లో గెలుచుకోలిగింది. పాతమిత్రుడితో జతకట్టడం ద్వారా మంత్రి మహేందర్‌రెడ్డిని దెబ్బతీసేలా ద్విముఖ వ్యూహాన్ని అమలుచేసే అంశాన్ని కేఎల్లార్ వర్గం పరిశీలిస్తోంది. ఇక టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా తమ గెలుపులో కీలకం కానున్నాయని కిచ్చన్న అంచనా వేస్తున్నారు. మండలి ఎన్నికల్లో టీడీపీ సొంతంగా పోటీచేసే అవకాశాలు లేకపోవడం, ఎంపీపీ ఎన్నికల్లో బీజేపీ కూడా మద్దతుగా నిలిచినందున.. ఆ పార్టీ కూడా తనకు అండగా నిలుస్తుందనే ఆశాభావంతో ఉన్నారు.

గుట్టుగా గులాబీ వ్యూహం
మరోసారి గెలుపు ఢంకా మోగించాలని భావిస్తున్న నరేందర్‌రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. మండలాలవారీగా ప్రజాప్రతినిధులతో భేటీ అవుతూ భవిష్యత్తు వ్యూహాన్ని వివరిస్తున్నారు. పరోక్ష ఎన్నికల  వ్యూహరచనలో దిట్టగా పేరున్న నరేందర్.. మరోసారి మండలిలో ప్రవేశించేందుకు ఇతర పార్టీల సభ్యులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారు. కాగా, సీనియర్‌నేత హరీశ్వర్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారు. ఇప్పటికే తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతుండడంతో ఆ పార్టీ వర్గాల్లో సస్పెన్స్ నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement