హామీలేమో ఫుల్లు అమలయ్యేవి నిల్లు | Politicians Are Forgotten Election Promises | Sakshi
Sakshi News home page

హామీలేమో ఫుల్లు అమలయ్యేవి నిల్లు

Published Sat, Nov 10 2018 9:38 AM | Last Updated on Sat, Nov 10 2018 9:56 AM

Politicians Are Forgotten Election Promises - Sakshi

మంచిర్యాలటౌన్‌: పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం మంచిర్యాల. ఇక్కడ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు లేవు. తలాపునే గోదావరి ఉన్నా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతీసారి ఎన్నికల్లో నాయకులు హామీలు ఇస్తున్నా మంచినీళ్లు మాత్రం రావడం లేదు. ఇంకా అనేక సమస్యలు తీరడం లేదు. 
 

 తలాపునే గోదావరి ఉన్నా తాగునీటి సమస్య తీరడం లేదు. మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నా నాయకులు పట్టించుకోవడం లేదు. మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లోనూ ప్రధాన సమస్య ఇదే. ప్రతీసారి ఎన్నికల్లో నేతలు హామీలు ఇస్తున్నా మంచినీళ్లు మాత్రం రావడం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచిర్యాల పట్టణంలో వసతులు కల్పించడం లేదు. ఈ సారి పనిచేసే నాయకులకే ఓటు వేస్తామంటున్నారు ఓటర్లు. 

మంచిర్యాల మండలం

 తలాపునే గోదావరి ఉన్నా గత రెండేళ్లుగా మంచిర్యాల మున్సిపాలిటీలో వారానికి రెండు, మూడుసార్లు మాత్రమే తాగునీటిని అందిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయితే 24 గంటలు తాగునీరు అందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే మిగిలింది.

  • మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల్లో మూడేళ్లుగా కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా అక్కడ డ్రెయినేజీలు లేక దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.
  • ఎన్నో ఏళ్లుగా టూటౌన్‌గా పిలిచే హమాలివాడ ప్రజలకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది.
  •  మంచిర్యాల ఐబీ నుంచి బొక్కల గుట్ట వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కావడం లేదు.  
  • జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ లేకపోవడం, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక పోలీసులు లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య పెరిగింది. 
  • మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో చెత్త వేసేందుకు పర్మినెంట్‌గా ఎలాంటి స్థలం లేక శివారు ప్రాంతాల్లోనే వేస్తున్నారు.
  • మంచిర్యాల ఏరియా ఆస్పత్రిని రెండు వందల పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయాలని, కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించాలన్న డిమాండ్‌ నెరవేరలేదు.
  •  మంచిర్యాల–రంగంపేట్‌ రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మాణం కలగానే మారింది. 
  •  మంచిర్యాల పట్టణంలోని హైటెక్‌సిటీ కాలనీ, హమాలివాడ, గోపాల్‌వాడ, తిలక్‌నగర్‌ ఏరియాల్లో మిషన్‌ భగీరథ పైపులు వేసేందుకు రోడ్లు తవ్వారు. ట్రయల్‌ రన్‌ను మొదలు పెట్టగానే పైపులు పగిలిపోయి కాలనీ రోడ్లన్నీ బురదగా మారుతున్నా సంబంధిత కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదు. 

     దండేపల్లి మండలం
     
  •  దండేపల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నిర్మాణానికి 2006లో రూ.33లక్షలు మంజూరయ్యాయి. ఈ స్థలంపై కోర్టు కేసు ఉండటంతో పనులు నిలిపివేశారు. గత పదేళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. 
  • పదేళ్ల క్రితం ధర్మరావ్‌పేట వాగుపై రూ.30లక్షలతో చేపట్టిన చెక్‌డ్యాం పనులు నిలిచిపోయాయి. మిగిలిన పనులకు రూ.13.7లక్షలు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదు. 
  •  దండేపల్లి పశు వైద్యశాల భవనం నిర్మాణానికి ఐదేళ్ల క్రితం నాబార్డు నుంచి రూ.13లక్షలు మంజూరైనా పనులు కాలేదు. 
  •  కడెం ఆయకట్టుకు రబీలో గూడెం ఎత్తిపోతల నీళ్లు అందిస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నీరందించాలని కోరుతున్నారు. 
  • లింగాపూర్‌ ఆదర్శ పాఠశాల హాస్టల్‌ నిర్మాణం పనులు ఏళ్లుగా పూర్తి కావడం లేదు. ఇవి పూర్తి చేస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు హామీ కూడా ఇచ్చారు. 
  • దండేపల్లి పీహెచ్‌సీని 2015 ఏప్రిల్‌ 7న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఐకేరెడ్డి, ఎంపీ సుమన్, ఎమ్మెల్యే దివాకర్‌రావు సందర్శించారు.  30 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మూడేళ్లయినా ఊసేలేదు.
     

హాజీపూర్‌ మండలం
 

  • కొత్తగా ఏర్పడిన హాజీపూర్‌ మండలంలో పూర్తిస్థాయిలో కార్యాలయాలు లేవు. గఢ్‌పూర్‌ జీపీతోపాటు మరో 7 గ్రామాలు మండల కేంద్రానికి 25 కి.మీ.పైగా దూరంగా ఉన్నాయి. వీరు ఏ పనికైనా మంచిర్యాల మీదుగా హాజీపూర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బస్సులు లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. మంచిర్యాలకు వచ్చి హాజీపూర్‌ వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి రూ.40 ఖర్చు, ఒక్కరోజు వచ్చి పోయేందుకు రూ.100 ఖర్చు చేయాల్సిన పరిస్థితి వీరిది. ఇక్కడ ఎక్కువగా గిరిజనులే నివసిస్తుండడంతో, హాజీపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్యసేవలు సైతం అంతంత మాత్రంగానే అందుతున్నాయి.
  •  మండలంలోని 8 గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం ఉన్నా, బస్సు సౌకర్యం లేక ప్రజలు ప్రైవేటు వాహనాల మీదే ఆధారపడుతున్నారు.
  • ఎల్లంపల్లి ప్రాజెక్టును గుడిపేట వద్ద నిర్మించగా మండలంలోని ఏడు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వీరికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. వీరి పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదు.

చెక్‌డ్యాంపై శ్రద్ధ చూపుతలేరు

ధర్మరావుపే ట చెక్‌డ్యాం పనులను 12 ఏళ్ల క్రి తం ప్రారంభించారు. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు.  చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే సాగునీటికి ఇబ్బందులు తొలగిపోతాయి అనుకుంటే నిర్మాణం పూర్తి చేసేం దుకు ఎవరూ శ్రద్ధ చూపడం లేదు.- దుర్గం బక్కయ్య, రైతు, ద్వారక, దండేపల్లి మండలం

భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి
 

దండేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి. కళాశాల నిర్మాణ స్థలంపై కోర్టు వివాదం ఉన్నా దానిని పరిష్కరించడంలో అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు. ఇందుకోసం ఆందోళనలు చేసినా ఫలితం లేదు. – పిట్టల తిరుపతి, పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు, దండేపల్లి 

రైల్వే బ్రిడ్జి నిర్మించాలి

మంచిర్యాలలో ట్రాఫిక్‌ సమస్య అధికంగా ఉంది. లక్ష్మీటాకీస్‌ బైపాస్‌ రోడ్డును కలుపుతూ హైటెక్‌సిటీ మీదుగా గల వంద ఫీట్ల రోడ్డును వెంటనే పూర్తి చేసి, హమాలీవాడకు వెళ్లేందుకు రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని నిర్మించాలి. దీంతోనే పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీరడంతోపాటు, టూటౌన్‌గా పిలిచే హమాలివాడ, గోపాల్‌వాడ, తిలక్‌నగర్, రాజీవ్‌నగర్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పుతాయి. – చంద్రమోహన్‌ గౌడ్, మంచిర్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement