జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఓవైపు ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా చూస్తేనే మరోవైపు ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. అయితే జిల్లాలోని పలు గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ అధికార్ల ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందులో భాగంగా మండలాల వారీగా సున్నితమైన సెంటర్లను గుర్తించారు. ఈ నివేదిక ఆధారంగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అత్యంత సమస్యాత్మక గ్రామాలు, 128 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తేల్చారు. దీంతో ఆయా సెంటర్ల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
సాక్షి, వికారాబాద్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 11వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. జిల్లాలోని 8 లక్షల మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం అధికారులు 1,126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 165, గ్రామాల్లో 961 సెంటర్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు గ్రామాలు, పోలింగ్ స్టేషన్ల వద్ద గొడవలు చేసుకుని భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ, పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటున్నారు.
అత్యంత సమస్యాత్మక గ్రామాలు
రెవెన్యూ, పోలీసు శాఖల సంయుక్త సర్వేలో జిల్లాలోని ఎనిమిది గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ పట్టణం, రావులపల్లి, హుస్నాబాద్, కుదురుమల్ల, చెల్లాపూర్ అత్యంత సమస్యాత్మకమైనవిగా నిర్ధారించారు. ఐదు పంచాయతీల పరిధిలో 32 అతి సున్నితమైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని నస్కల్, సుల్తాన్‌పూర్, దోమ గ్రామాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
వీటి పరిధిలో తొమ్మిది అత్యంత సున్నితమైన సెంటర్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. వీటితోపాటు జిల్లాలో 128 సమస్యాత్మక సెంటర్లు ఉన్నట్లు తేల్చారు. పరిగి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 32, వికారాబాద్‌లో 26, తాండూరులో 32, కొడంగల్‌లో 38 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతోపాటు కేంద్ర పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించనున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు సైతం సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘలను లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలింగ్ రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను మొహరిస్తాం. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
– నారాయణ, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment