
'బాబును ఏ1, రేవంత్ ను ఏ2 గా చేర్చాలి'
నల్గొండ: ఓటుకు రూ. 5 కోట్ల కేసులో చంద్రబాబునాయుడిని ఏ-1 ముద్దాయిగా, ఈ ఘటనతో సంబంధమున్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్, రాష్ట్రపతిలను ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేశారన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెప్పడం కాదని, తక్షణమే ఆ పని చేయాలని, చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చి, అరెస్టు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి మారే అంశానికి కూడా తక్షణమే పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రేవంత్‌రెడ్డిని ఏ-2 ముద్దాయిగా, ప్రలోభాలతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి సరిగా వ్యవహరించాలని పొంగులేటి అన్నారు.
(చౌటుప్పల్)