కేసీఆర్ పాలనలో 171 మంది రైతులు ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఇప్పటివరకు 171 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని... అందులో 30 మంది రైతులు సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పరిపాలనపై పొన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ప్రాధాన్యత లేని అంశాలకు పెద్ద పీట వేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఓ విధంగా నీరో చక్రవర్తిలా కేసీఆర్ వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సీఎం పీఠం ఎక్కి వంద రోజులైనా రాష్ట్రంలో కరువు, కరెంట్, రైతుల ఆత్మహత్యలను కనీసం పట్టించుకోలేదని... రైతుల సమస్యలపై చర్చించిన దాఖలాలే లేవని పొన్నాల ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఆయన ఆలోచనలు ఆకాశంలో ఉంటే... చేతలు మాత్రం పాతాళంలో ఉన్నాయన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత విద్యుత్ను అమల్లోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. అంతేకాకుండా రూ. 1200 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేశామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం ఇది ఆరంభం మాత్రమే అని పొన్నాల వెల్లడించారు.