
ఆన్‌లైన్‌లో అదనపు కిలోవాట్స్‌కు చెల్లించాల్సిన రుసుం వివరాలు ఇలా కనిపిస్తాయి
కుత్బుల్లాపూర్: ఇక ముందు మీ కరెంట్ మీటర్ వచ్చేదానికన్నా ఎక్కువగా రావచ్చు. సాధారణ కరెంట్ బిల్లుకు అదనపు ఛార్జిల పేరిట ఈ వడ్డింపు ఉండవచ్చు. కారణం మీరు ఇది వరకు తీసుకున్న లోడ్ కన్నా ఎక్కువ విద్యుత్‌ను వినియోగించడమే. అవును.. అదనపు విద్యుత్ లోడ్ ను వినియోగించుకున్న ఇళ్ల కనెక్షన్‌దారులు ఇక మీదట ఎంత మేర అదనపు లోడు వాడుకుంటున్నారో దానికి డెవలప్‌మెంట్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. రోజు రోజుకు విద్యుత్ వినియోగం అనుకున్న దాని కంటే ఎక్కువగా పెరిగిపోతుండడమే కాకుండా వచ్చే వేసవిలో ఈ వినియోగం మరింత ఎక్కువ పెరిగిపోనుంది. ఈ క్రమంలో ఇంత వినియోగదారులకు ఉన్న లోడ్ ను తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరి.
అదనపు లోడంతే..
సాధారణ గృహ అవసరాలకు విద్యుత్ కనెక్షన్ తీసుకునే ముందు 1 కేవీ డబ్బుతో పాటు ఇతరాత్రా చార్జీలు చెల్లించి కనెక్షన్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు దాదాపుగా అందరూ ఫ్రిజ్‌లు, ఏసీలు, మోటార్లు ఇలా అన్ని రకాల విద్యుత్ ఉపకరణాలు వాడడంతో 1 కిలోవాట్ లోడు కన్నా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఈ భారం డిస్కమ్‌పై పడుతుంది. అసలు గృహాలకు ఎంత లోడు పడుతుందో తెలుసుకుని దానికి తగ్గ విద్యుత్ సరఫరా చేస్తాయి డిస్కమ్‌లు. గృహ వినియోగదారులు ఒక కిలో వాట్ లోడు తీసుకుని దాన్ని రెండు లేక మూడు ఇంకా అదనపు కిలో వాట్‌ల లోడు వాడుకుంటుండడంతో విద్యుత్ సరఫరా పై భారం పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలడం లేదా ఎక్కడైనా సప్‌లైలో అంతరాయం ఏర్పడుతోంది. దీనికి చెక్ పెట్టడానికే అదనపు లోడు వాడుకునే గృహ వినియోగదారుల నుంచి డెవలప్‌మెంట్ చార్జీలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు విద్యుత్ అధికారులు. తద్వారా వసూలైన డబ్బులతో అదనపు సామర్ధ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం, డిస్కమ్‌లో మెరుగైన విద్యుత్ సరఫరాకు వినియోగించనున్నారు.
తెలుసుకోండి ఇలా..
ప్రతి గృహ వినియోగదారుడికి నెల నెలా వచ్చే కరెంట్ బిల్లులో సర్వీసు నెంబరు కింద మన ఎంత వరకు లోడు వాడుకోవచ్చనే విషయాన్ని ‘కాంట్రాక్టడ్ లోడ్’ పక్కన ఎన్ని కిలోవాట్లు అన్నది రాసి ఉంటుంది. దాని కిందనే ఆర్‌ఎండి (రికార్డెడ్ మ్యాగ్జిమమ్ డిమాండ్) వద్ద మీరెంత లోడు వాడుకుంటున్నది తెలుస్తుంది. మీరు తీసుకున్న లోడుకు అసలు వాడుతున్న లోడుకు ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ తెలిసిపోతుంది. ఈ విధానంతో పాటు టీఎస్‌ఎస్‌పిడీసీఎల్ సైటులో యుఎస్‌ఇ నెంబరు ఎంటర్ చేస్తే మీరు అదనపు లోడు తీసుకోవాలా, అవసరం లేదా అనేది తెలిసి పోతోంది.
50 శాతం రాయితీతో..
అదనపు లోడు ఛార్జీలను స్వచ్చందంగా చెల్లించే గృహ వినియోగదారులకు 50 శాతం రాయితీ కల్పించేందుకు టీఎస్‌ఎస్‌పిడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఇందుకు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో డబ్బులు చెల్లించే వెసలుబాటు ఉంది. కన్జూమర్ సర్వీస్ సెంటర్‌లతో పాటు టీఎస్‌ఎస్‌పిడీసిఎల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ చేసి రాయితీ పొందవచ్చు. టీఎస్‌ఎస్‌పిడీసీఎల్ సైటు ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్ మీద 50 శాతం రాయితీ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ యూఎస్‌ఇ నెంబరు ను ఎంటర్ చేస్తే మీ కనెక్షన్ వివరాలతో పాటు అసలు మీరు ఎంత లోడు వాడుకుంటున్నారు, మీకు ప్రస్తుతం ఉన్నది ఎంత తదితర వివరాలు తెలుస్తాయి. ఇక్కడ మీరు అదనపు లోడు తీసుకోవాలంటే దానికి చెల్లించాల్సిన రుసుం 50 శాతం రాయితీతో చూపిస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్, అప్లికేషన్ ఫీజు, డెవలప్‌మెంట్ ఛార్జస్ కలిపి మొత్తం ఎంత కట్టాలో కనిపిస్తుంది. దీన్ని ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయవచ్చు.
50 శాతం రాయితీని వినియోగించుకోండి..
అదనపు విద్యుత్‌ను వాడుకునే గృహ వినియోగదారులు అదనంగా వాడుకునే లోడుకు విధిగా డబ్బులు కట్టాల్సిందే. ఒక కిలోవాట్ కు రూ.1800 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్వచ్చంధంగా ముందుకు వచ్చి డబ్బులు చెల్లించే వారికి డిస్కం 50 శాతం రాయితీ ఇస్తుంది. ఈ విధానం వల్ల వినియోగదారులపై అదనపు భారం తగ్గుతుంది. కేవలం కిలోవాట్‌కు రూ.600 తో పాటు 18 శాతం జీఎస్టీ రుసుం ను చెల్లిస్తే సరిపోతుంది. ఆగస్టు 5, 2019 వరకు ఈ అవకాశముంటుంది. కాబట్టి గృహ వినియోగదారులందరూ 50 శాతం రాయితీ అవకాశాన్ని వినియోగించుకోండి. – సిహెచ్ రమేష్, అడిషనల్ విద్యుత్ ఏఇ కుత్బుల్లాపూర్
Comments
Please login to add a commentAdd a comment