భయపెడుతున్న కరెంటు బిల్లు..! | Hyderabad People Worried on Electricity Bills | Sakshi
Sakshi News home page

బిల్లు మోత.. విద్యుత్‌ వాత!

Jun 6 2020 7:50 AM | Updated on Jun 6 2020 9:00 AM

Hyderabad People Worried on Electricity Bills - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): ‘సైదాబాద్‌కు చెందిన సుల్తాన్‌ అహ్మద్‌ ఓ చిరు వ్యాపారి. ఆయన ఇంటి విద్యుత్‌ బిల్లు మార్చికి ముందు నెలకు సగటున రూ.800 విద్యుత్‌ బిల్లు వచ్చేది. లాక్‌డౌన్‌ సమయంలో రోజంతా ఇంట్లోనే ఉండాల్సి రావడం, రోజంతా కూలర్, ఫ్యాను, లైట్లు, టీవీ ఆన్‌లో ఉండటం వల్ల ఆయన రోజు వారి సగటు విద్యుత్‌ వినియోగం రెట్టింపైంది. మూడు నెలలకు కలిపి ఒకే సమయంలో రీడింగ్‌ నమోదు చేయడం వల్ల స్లాబ్‌ రేట్‌ మారిపోయి ఆయన నెలసరి విద్యుత్‌ బిల్లు రూ.2300 దాటింది. మీటర్‌ రీడర్‌ చేతికిచ్చిన ఈ బిల్లును చూసి ఆయన గుండె గు‘భిల్లు’’మంది.’(కరెంట్‌ బిల్లు తగ్గించుకోండిలా..)

...ఇది ఒక్క సుల్తాన్‌ అహ్మద్‌ బాధ మాత్రమే కాదు. గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలోని ప్రతి ఒక్క విద్యుత్‌ వినియోగదారుడు చేతికందిన విద్యుత్‌ బిల్లులను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రూ.250 నుంచి 300 వచ్చే వినియోగదారులకు ఏకంగారూ.వేలల్లో బిల్లులు జారీ కావడంతో ఆందోళన చెందుతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల గత మూడు నెలల నుంచి ఉపాధి లేదు. పైసా ఆదాయం లేక ఇళ్లు గడవడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారీగా పెరిగిన ఈ బిల్లులను ఎలా చెల్లించాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోయారు.

పెరిగిన కరెంట్‌ వినియోగం...
రెట్టింపైన బిల్లులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 55 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, వీటిలో 47.50 లక్షల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. మరో ఏడు లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలకు సంబంధించిన కనెక్షన్లు మరో 50 వేల వరకు ఉన్నాయి. ఏప్రిల్, మే నెలలో రోజుకు సగటున 50 ఎంయూ సరఫరా జరిగింది. వీటి నుంచి నెలకు సగటున రూ.1200 కోట్లకుపైగా రెవిన్యూ వస్తుంది. మార్చి 22 జనతా కర్ఫ్యూ..ఆ తర్వాతి రోజు నుంచి వరుసగా లాక్‌డౌన్‌లు అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సిటిజన్లంతా ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లు, ఫ్యాన్లల వినియోగం పెరిగింది. చలి ప్రదేశంలో కరోనా వైరస్‌ విస్తరించే అవకాశం ఉందనే భయంతో కొంత మంది ఏసీల వాడకాన్ని తగ్గించినప్పటికీ.. చాలా మంది వినియోగించారు. దీనికి తోడు ఐటీ దాని అనుబంధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం అవకాశాన్ని ఇచ్చాయి. ఫలితంగా ఇంట్లో వ్యక్తిగత కంప్యూటర్ల వినియోగం పెరిగింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు కాలక్షేపం కోసం రోజంతా ఇంట్లోని టీవీలకి అతుక్కుపోయారు. వంటింట్లో మిక్సీల వినియోగంతో పాటు ఇంట్లోని వాటర్‌ మోటార్ల వినియోగం కూడా పెరిగింది. ఫలితంగా మీటర్‌ రీడింగ్‌ గిర్రున తిరిగి నెలసరి సగటు వినియోగం సహా బిల్లులు భారీగా పెరిగాయి. చేతికందిన ఈ బిల్లులను చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

చేతికిచ్చిన బిల్లులోనూ స్పష్టత కరువే..
ఏ నెలకు.. ఆ నెల రీడింగ్‌ నమోదు చేస్తే.. స్లాబ్‌ రేట్‌ మారేది కాదు. ఒక నెల బిల్లు ఎక్కువొస్తే.. మరుసటి నెలలో కరెంట్‌ వినియోగాన్ని తగ్గించి నెలవారి బిల్లును తగ్గించుకునేవారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో రీడింగ్‌ నమోదు చేయలేదు. వరుసగా రెండు నెలలు రీడింగ్‌ తీయక పోవడం, మూడు నెలలకు కలిపి ఒకేసారి రీడింగ్‌ నమోదు చేయడం, మొత్తం యూనిట్లను మూడు నెలలకు విభజించారు. స్లాబ్‌రేట్‌లో అధిక బిల్లులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు వినియోగదారులను కరోనా వైరస్‌ భయపెడితే..తాజాగా చేతికందిన కరెంట్‌ బిల్లులు భయపెడుతున్నాయి.

మూడు నెలలకు సంబంధించిన బిల్లులను ఒకేసారి జారీ చేయడం..ఏ నెలలో ఎన్ని యూనిట్లు కాల్చామనే అంశంలో చేతికిచ్చిన బిల్లులో స్పష్టత లేక పోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది చెల్లించిన బిల్లుల ఆధారంగా లాక్‌డౌన్‌ సమయంలోని బిల్లులను చెల్లించాలని డిస్కం సూచించడంతో నగరంలోని చాలా మంది వినియోగదారులు ముందస్తు బిల్లులు చెల్లించారు. అయితే ఏ నెలలో ఎంత చెల్లించారు? ఎంత బిల్లు పెండింగ్‌లో ఉంది? వంటి అంశాల్లోనూ స్పష్టత లేకపోవడం ఆందోళన కలి గిస్తుంది. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రకటిస్తుంది. సాధారణంగా వేసవిలో విద్యుత్‌ వి నియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ మేరకే బిల్లులు వస్తాయని, ఇందులో ఎలాంటి దోపిడి లేదని స్పష్టం చేస్తుండటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement