సికింద్రాబాద్ జింఖానా సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫ్యాన్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ రికార్డు స్థాయిలో వినియోగమవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌తో విద్యుత్ అధికారుల దిమ్మతిరుగుతోంది. నగరంలో పగటి ఉష్ణోగ్రత లు పెరుగుతుండడంతో విద్యుత్ అధికంగా అవసరమవుతోంది. ఉక్కపోత నుంచిఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లవినియోగం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపు అయింది. ఫలితంగా గతంతో పోలిస్తే ప్రస్తుతం విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతేడాది ఇదే నెల రెండో వారంలో అత్యధికంగా 62 మిలియన్ యూనిట్లు నమోదు కాగా... తాజాగా ఈ నెల 17న రికార్డు స్థాయిలో 66.09 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఒక్కసారిగా పెరిగిన ఈ డిమాండ్‌తో సబ్‌స్టేషన్లపై భారం పడుతోంది. రెట్టింపైన వినియోగానికి తోడు మండుతున్న ఎండలకు సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు త్వరగా హీటెక్కుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
స్టేషన్లలో ఫ్యాన్లు...
గ్రేటర్ పరిధిలో 50లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా... వీటిలో 45 లక్షలు గృహ, 5 లక్షలకు పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకు పైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన కరెంట్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోంది. ఓవర్ లోడు వల్ల ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేడిమి నుంచి ఉపశమనం కోసం కొన్ని సబ్‌స్టేషన్లలోని పవర్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఇప్పటికే ఫ్యాన్లు అమర్చారు. డీటీఆర్‌లు కాలిపోయే ప్రమాదం ఉండడంతో ఇంజినీర్లు డిమాండ్ ఎక్కువగా ఉన్న ఫీడర్ల పరిధిలో అత్యవరసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో సరఫరా నిలిపివేస్తున్నారు. అసలే ఉక్కపోత..ఆపై రాత్రిపూట ఇంట్లో ఫ్యాన్లు కూడా తిరగకపోవడంతో దోమలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
రేడియేషన్ ప్రభావం...
ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు (98.6 పారిన్‌హీట్స్) కాగా... అంతకంటే ఎక్కువ స్థాయిలో ఈ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో రేడియేషన్ సూచి 10 పాయింట్లు దాటింది. రికార్డుస్థాయిలో నమోదువుతున్న పగటి ఉష్ణోగ్రతలకు తోడు రేడియేషన్ వల్ల సిటిజనులు వడదెబ్బకు గురువుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, యాచకులు, వాహనదారులు ఎక్కువగా అస్వస్థతకు గురవుతున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఫలితంగా ఫీవర్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు చేరుకుంటున్న జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అనేక మంది ఇప్పటికే వడదెబ్బ బారినపడి మృతి చెందినప్పటికీ.. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం వద్ద వడదెబ్బ మృతుల వివరాలు కూడా నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment