విద్యుత్ కార్మికుల సమ్మెకు తెర
12% ప్రత్యేక అలవెన్స్‌తో పాటు రూ. 5 లక్షలకు ఎక్స్‌గ్రేషియా పెంపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు సమ్మెను విరమించారు. విద్యుత్ సంస్థల తరఫున ‘దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ’ (ఎస్‌పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం కార్మిక జేఏసీ నేతలతో జరిపిన చర్చలు ఫలించాయి. వేతనాలు, ఎక్స్‌గ్రేషియా పెంపు, ప్రమాద బీమా సదుపాయం తదితర డిమాండ్ల పరిష్కారానికి హామీ లభించడంతో గత 17 రోజులుగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహించిన సమ్మెకు తెరపడింది. విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించాలనే కార్మికుల ప్రధాన డిమాండును యాజమాన్యాలు ససేమిరా ఒప్పుకోలేదు. ఇప్పటికే కొన్ని కార్మిక యూనియన్లు సమ్మె నుంచి తప్పుకోవడంతో విధి లేని పరిస్థితిలో సమ్మెను వీడాల్సి వచ్చిందని కార్మిక జేఏసీ ప్రకటించింది. ప్రస్తుతం జీవో నం.3 ప్రకారం వేతనాలు చెల్లిస్తుండగా, జీవో నం.11 ఆధారంగా చెల్లించే విషయంపై పరిశీలన జరుపుతామన్నారు. మూల వేతనంపై 12 శాతం స్పెషల్ అలవెన్స్‌ను వచ్చే నెల 1 నుంచి చెల్లించేందుకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. విధి నిర్వహణలో మృతి చెందే కార్మికులకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచేందుకు అంగీకరించాయి. రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించాయి. ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్టర్లు తొలగించకుండా అధికారులు పర్యవేక్షించనున్నారు.
తప్పని పరిస్థితిలో సమ్మె విరమణ: సాయిలు, కార్మిక జేఏసీ నేత
సీఐటీయూ, 327, తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్‌లు సమ్మెను విఫలం చేసేందుకు ప్రయత్నించాయని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నేత సాయిలు ఆరోపించారు. విధి లేని పరిస్థితిలో సమ్మెను విరమించామని పేర్కొన్నారు. గత 12 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సాయిలుకు ఎస్పీడీసీఎల్ డెరైక్టర్(హెచ్‌ఆర్) మీర్ కమాలుద్దీన్ ఖాన్ ఉస్మానియా ఆస్పత్రిలో నిమ్మ రసం అందించి సమ్మెను విరమింపజేశారు.