
సాక్షి, హైదరాబాద్ : ‘‘వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ సబ్సిడీలు ఇవ్వడం మంచిది కాదని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ నేను అలా భావించడం లేదు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించడానికి ప్రభుత్వ సబ్సిడీని రూ. 4,777 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు పెంచుతున్నాం. అవసరమైతే మరో రూ. 500 కోట్ల ఇవ్వడానికైనా సిద్ధం. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.10 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది.
రైతులకు అందించే సబ్సిడీల ద్వారా రూ.లక్ష కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. దీంతో రైతుల పరిస్థితులతోపాటు రాష్ట్ర జీడీపీ వృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్...జనవరి 1 నుంచి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరాయ విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. యాసంగి (రబీ)లో పంపుసెట్లకు విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది కాబట్టి రైతులకు 24 గంటల విద్యుత్ అందించడం ముఖ్యమన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమన్నారు.
ఐదు కేటగిరీలుగా సరఫరా విభజన...
‘‘విద్యుత్ సరఫరాను వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు–మిషన్ భగీరథ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలుగా విభజించుకొని దేనికెంత విద్యుత్ అవసరమో గుర్తించి ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. భవిష్యత్తులో గృహ, వాణిజ్య విభాగాల డిమాండ్‌లో వచ్చే సహజ పెరుగుదలతోపాటు ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ విద్యుత్, పారిశ్రామిక విద్యుత్‌లో భారీగా పెరుగుదల ఉంటుంది. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయి’’అని సీఎం పేర్కొన్నారు.
జిల్లాలవారీగా ప్రస్తుత విద్యుత్ డిమాండ్–సరఫరా, రాబోయే కాలంలో ఏర్పడే డిమాండ్–సరఫరా అంశాలపై డైరెక్టర్లు, సీఈలు, ఎస్‌ఈలతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడారు. అన్ని పాత జిల్లా కేంద్రాల్లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాక్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, సబ్‌స్టేషన్ల ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులో ఉంచామని, ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా 24 గంటల్లో కొత్తది ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్ర, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డిస్కంల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్‌రావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ముందున్నాం..
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడంతోపాటు అన్ని వర్గాలకు నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు మెరుగైన సేవలు అందిస్తున్నాయని కేసీఆర్ కొనియాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
అహోరాత్రులు శ్రమించి విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఈ ఘనత సాధించారని అభినందించారు. విద్యుత్‌శాఖ పనితీరుతో రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, ఇదే స్ఫూర్తితో రైతులకు నిరంతర విద్యుత్ అందించడంతోపాటు వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లు, మిషన్ భగీరథ, కొత్త పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ అందించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
12 వేల మెగావాట్ల అదనపు డిమాండ్‌కు సిద్ధంకండి ...
‘‘గోదావరిపై కాళేశ్వరం, సీతారామ, దేవాదుల లాంటి భారీ ప్రాజెక్టులతోపాటు గూడెం, శ్రీపాద, ఎల్లంపల్లి లాంటి చిన్న ఎత్తిపోతల పథకాలు కూడా వస్తున్నాయి. కృష్ణపై పాలమూరు–రంగారెడ్డి, డిండి లాంటి పథకాలు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా అవసరమైన విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయాలి.
ఎత్తిపోతల పథకాలతోపాటు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన 1,300 పంపుసెట్లకు అవసరమైన విద్యుత్‌ను అందించాలి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు కలిపి 10 వేల నుంచి 12 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరమవుతుంది. దీనికి తగ్గట్లు విద్యుత్‌ను సమకూర్చుకోవడంతోపాటు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచాలి’’అని సీఎం అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment