
సర్కారుకూ కష్టాలు
అన్ని వర్గాలూ ఇక్కట్లలో ఉన్నాయి..
దీని ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది
నోట్ల రద్దుపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్
► రాష్ట్ర ఆదాయం బాగా తగ్గుతోంది
► తక్షణం ఉపశమన చర్యలు చేపట్టాలి
► పూర్తిగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు సాధ్యం కాదు
► నగదు విత్‌డ్రాలో ఆంక్షలు సడలించాలని విజ్ఞప్తి
► సంక్షేమ ఆర్థిక వ్యవస్థకు వెసులుబాటు ఉంటుందన్న ప్రధాని
► రాష్ట్రాలకు అండగా నిలుస్తామని హామీ
ఉన్నపళంగా నగదు రద్దుతో గ్రామీణ ప్రాంతాల్లోని వాణిజ్య, వ్యాపారాలన్నీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. ఆయా వ్యాపారాలపై ఆధారపడిన చిరుద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వైద్యం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో లేదు. విద్యాసంస్థలు కూడా ఫీజులు స్వీకరించే పరిస్థితి లేక.. సిబ్బందికి వేతనాలు అందటం లేదు. వీటన్నింటికీ ఉపశమనంగా నగదు ఉపసంహరణలో ఆంక్షలు సడలించాలి. – సీఎం కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం ప్రజలకు, ప్రభుత్వానికి తీరని కష్టనష్టాలను మిగుల్చుతోందని.. ఇది దీర్ఘకాలం ప్రభావం చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నోట్ల రద్దు పరిణామాల కారణంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధానికి వివరించారు. ఈ పరిస్థితి చక్కబడడానికి పలు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రైతులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నోట్ల రద్దు అంశంపై ఇటీవల కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్... శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి నివాసంలో మోదీతో దాదాపు 45 నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నోట్ల మార్పిడి, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ, చిల్లర మార్పిడి కోసం ప్రజలు పడుతున్న కష్టాలను ప్రధానికి వివరించారు. అనంతరం ఒక్కో రంగంపై నోట్ల రద్దు చూపిన ప్రభావాన్ని వెల్లడించారు. వ్యవసాయ రంగం, పౌల్ట్రీ, చిరు పరిశ్రమలు, హోటళ్లు, విద్యార్థులు, చిరుద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ప్రధానంగా తెలంగాణలో 9 సహకార బ్యాంకులు, 272 శాఖలతో పనిచేస్తున్నాయని... వాటిల్లో 12 లక్షల మంది రైతులు ఖాతాదారులుగా ఉన్నారని తెలిపారు. అకస్మాత్తుగా ఈనెల 14 నుంచి సహకార బ్యాంకుల్లో నగదు మార్పిడిని నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖరీఫ్‌లో పంటలు అమ్ముకుని, రబీకి సన్నద్ధమయ్యే తరుణంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఆశనిపాతంగా మారిందని తెలిపారు. రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డులకు తీసుకెళ్లే పరిస్థితులు సన్నగిల్లాయని.. ట్రేడర్లకు విక్రయించినప్పుడు ట్రేడర్ల ద్వారా నగదు గానీ, చెక్కులు గానీ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని సూచించారు. ఇందుకు బ్యాంకులను కూడా సమాయత్త పరచాలని విన్నవించారు.
పూర్తిగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు ఎలా సాధ్యం?
కాస్మొపాలిటన్ నగరాల్లోనే పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్ చెల్లింపులు లేవని, అలాంటప్పుడు పల్లెల్లో, పట్టణాల్లో, చిన్న నగరాల్లో పూర్తిగా ఎలక్ట్రానిక్ చెల్లింపులు సాధ్యం కావడాన్ని ఊహించలేమని ప్రధానికి కేసీఆర్ వివరించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఆధారిత వ్యాపారాలే ఎక్కువగా ఉంటాయి. పల్లె ప్రజల సౌలభ్యానికి అనుగుణంగా అక్కడి వాణిజ్య, వ్యాపార సంస్థలు నగదు రూపంలోనే బిల్లులు స్వీకరిస్తాయి. ఉన్నఫళంగా నగదు రద్దుతో ఆయా వ్యాపారాలన్నీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్నాయి. ఆయా వ్యాపారాలపై ఆధారపడిన చిరుద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. చలామణీలో ఉన్న కరెన్సీలో 86 శాతం రద్దవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ వైద్యం దేశవ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో లేదు. ప్రైవేటు డాక్టర్లు ఎలక్ట్రానిక్ చెల్లింపుల ప్రక్రియను కలిగి లేరు. ఇక విద్యాసంస్థలు కూడా ఫీజులు స్వీకరించే పరిస్థితి లేనప్పుడు వాటిలో పనిచేసే సిబ్బందికి వేతనాలు అందే పరిస్థితి లేదు. వీటన్నింటికీ ఉపశమనంగా నగదు ఉపసంహరణలో ఆంక్షలు సడలించాలి. కొత్త రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు పరిణామం నిరుత్సాహానికి గురిచేసింది. నిజాయతీపరులైన గృహ కొనుగోలుదారులకు తగిన ప్రోత్సాహకాలు ప్రకటించి ఆ రంగాన్ని మళ్లీ ఉరకలెత్తించాలి..’’ అని కేసీఆర్ కోరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల్లో చిన్న నోట్లతోపాటు కొత్త రూ.500 నోట్లను అందుబాటులో ఉంచితే క్రమంగా ప్రజల కష్టాలు తగ్గుతాయని పేర్కొన్నట్లు తెలిసింది.
ఆదాయం తగ్గిపోయింది
ప్రజల వద్ద నగదు లేకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కుంటుపడిందని ప్రధానికి సీఎం కేసీఆర్ వివరించారు. అత్యవసరాలతో పాటు నిత్యావసరాలకూ ఇబ్బందులున్న పరిస్థితుల్లో ప్రజలు వినోదం పొందడం, హోటళ్లకు వెళ్లడం, కొత్త వస్త్రాలు, సామగ్రి కొనుగోలు చేయడం వంటివి వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి అని... తద్వారా వినోద పన్ను, అమ్మకపు పన్ను సహా ఇతర పన్నులను రాష్ట్రాలు కోల్పోతున్నాయని తెలిపారు. ఈ ఆదాయాన్ని తిరిగి మరెప్పుడో పొందగలగడం సాధ్యం కాదని వివరించారు. సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం ఉందన్నారు. వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయం రూ.2,600 కోట్ల మేర, రవాణా శాఖ రూ.450 కోట్లు, ఎక్సైజ్‌శాఖ రూ.200 కోట్లు ఆదాయం కోల్పోతున్నాయని వివరించారు. మొత్తంగా రూ.3 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉందని తెలిపారు. దీనిని భవిష్యత్తులో కూడా పొందలేమని, అందువల్ల ప్రభుత్వానికి కొంత ఉపశమనం కల్పించాలని కోరారు. కేంద్రానికి చెల్లించాల్సిన అప్పుపై ఏడాది పాటు మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను పూర్తిగా చెల్లించడంతోపాటు ముందస్తు పంపిణీ కూడా చేయాలని కోరినట్టు సమాచారం.
మంచి ఫలితాలు ఉంటాయన్న ప్రధాని
పాత నోట్ల రద్దుతో ఇబ్బందులున్నా దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఉంటాయని.. రాష్ట్రాలకు కేంద్రం అండగా ఉంటుందని కేసీఆర్‌కు ప్రధాని మోదీ భరోసా ఇచ్చినట్టు సమాచారం. నగదు డిపాజిట్లతో ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.3 లక్షల కోట్ల వెసులుబాటు దక్కుతుందని, దీంతో సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలుచేసే వీలు కలుగుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడతామని మోదీ వివరించినట్టు సమాచారం. ప్రధానితో భేటీ వివరాలను సీఎం కేసీఆర్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్ కలుస్తారని వెల్లడించాయి.